కాన్బెర్రా: 16 ఏండ్ల లోపువారు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నెల 10 నుంచి ఇది అమలు కానుంది. ఇందుకోసం ఆన్లైన్ భద్రత సవరణ(సామాజిక మాధ్యమాల కనిష్ఠ వయస్సు) చట్టం-2024ను ప్రభుత్వం తీసుకొచ్చింది. మొదట్లో వ్యతిరేకించినా చివరకు ఈ చట్టం అమలుకు సహకరిస్తామని సోషల్ మీడియా కంపెనీలు తెలిపాయి. ఇప్పటికే మెటా లాంటి కంపెనీలు 16 ఏండ్ల లోపు వారి సామాజిక మాధ్యమ ఖాతాలను తొలగించడం ప్రారంభించాయి. యూజర్లు తమ ఖాతాలను 16 ఏండ్ల వయసు వచ్చే వరకు స్తంభింపచేసుకొనే అవకాశాన్నీ కల్పించాయి. సోషల్ మీడియా వాడకం వల్ల లక్షలాది మంది పిల్లలు ఆన్లైన్ వేధింపులకు, ఆందోళనకు గురవుతున్నారని ప్రభుత్వం వాదిస్తున్నది. పిల్లల మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని నిరోధించేందుకు తాజా చట్టాన్ని తెచ్చినట్లు తెలిపింది.