రియాద్: ఇసుక మేటలతో నిండి ఉండే సౌదీ అరేబియా ఎడారిలో చరిత్రలో తొలిసారిగా రికార్డు స్థాయిలో హిమపాతం నమోదైంది. ఆల్-జాఫ్ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఇసుకతో దర్శనమిచ్చే ఆ ఎడారి ప్రాంతం ఇప్పుడు మంచు దుప్పటి కప్పుకుని అంటార్కిటికాను గుర్తు చేస్తూ శీతాకాలపు వింత భూమిగా మారిపోయింది.
ఇటీవల వచ్చిన భారీ తుఫాన్లు, భారీ వర్షాల కారణంగానే ఈ రీజియన్లో తీవ్రంగా హిమపాతం కురిసిందని, దీంతో కొండలు, ఎడారి ప్రాంతాల్లో మంచు పరుచుకుందని ఖలీజ్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. రానున్న రోజుల్లో వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సౌదీ అరేబియా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బలమైన గాలులతో భారీ వర్షపాతం నమోదు కావచ్చునని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.