Musar @ Slovenia | రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియా దేశాధ్యక్షురాలుగా నటాసా పిర్క్ ముసార్ ఎన్నికయ్యారు. ఈమె తొలి మహిళా అధ్యక్షురాలు. మాజీ విదేశాంగ మంత్రి అంజె లోగర్ను ఇటీవలి ఎన్నికల్లో ఓడించి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మెలానియా ట్రంప్‌కు న్యాయవాదిగా ముసార్ వ్యవహరించారు. స్వతంత్ర అభ్యర్థిగా అధ్యక్ష పదవికి పోటీ చేసిన 54 ఏండ్ల ముసార్కు సెంటర్-లెఫ్ట్ ప్రభుత్వం మద్దతు తెలిపింది.
ఆదివారం జరిగిన రన్ ఆఫ్ ఓటింగ్‌లో ముసార్ 54 శాతం ఓట్లు సాధించి ప్రత్యర్థి లోగర్పై విజయం సాధించారు. లోగర్ కన్నా 8 శాతం ఓట్లు ఎక్కువగా ముసార్కు దక్కాయి. మొత్తం పోలింగ్ శాతం 49.9 గా ఉన్నది. ఈయూ, నాటో సభ్య దేశమైన స్లోవేనియాకు 30 ఏండ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగిన బోరుట్ పహోర్ స్థానంలో ముసార్ అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. స్లోవేనియా సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌తో పాటు అనేక మంది ఉన్నతాధికారులను దేశాధ్యక్షుడు నామినేట్ చేస్తారు.
తన భర్త సంపదను పెంచేందుకు ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని పన్నుల నుంచి బయటపడేశారన్న ఆరోపణలు కూడా ముసార్పై ఉన్నాయి. తనపై వచ్చిన ఆరోపణలను ముసార్ కొట్టివేసింది. తన భర్త కంపెనీలన్నీ చట్టబద్ధంగా నడుస్తున్నాయని, అన్ని పన్నులు చెల్లిస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. పిర్క్ ముసార్ టీవీ ప్రజెంటర్‌గా వృత్తిజీవితాన్ని ప్రారంభించి ప్రభావవంతమైన న్యాయవాదిగా మారారు. మానవ హక్కులు, రూల్ ఆఫ్ లా, సామాజిక సంక్షేమ సమస్యలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.