Slovakia PM Attack | స్లావేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై బుధవారం దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గాయపడిన రాబర్ట్ ఫికోను చికిత్స కోసం దవాఖానకు తరలించినట్లు దేశాధ్యక్షుడు జుజానా కాపుటోవా ధ్రువీకరించారు. హౌస్ ఆఫ్ కల్చర్ బయట జరిగిన అధికారిక కార్యక్రమంలో రాబర్ట్ ఫికో మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది. దుండగుడు పలు రౌండ్లు కాల్పులు జరుపడంతో కింద పడిపోయారని వార్తలొచ్చాయి. రాబర్ట్ ఫికోకు నాలుగు బుల్లెట్లు తగిలాయని ప్రభుత్వ అధికార చానెల్ వెల్లడించింది.
అనుమానిత వ్యక్తిని ప్రత్యక్ష సాక్షులు పట్టుకున్నారు. ప్రధానిపై కాల్పులు జరుపడంతో ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు అనుమానితుడ్ని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. దేశ ప్రధాని రాబర్ట్ ఫికోపై క్రూరమైన దాడిని అధ్యక్షుడు జుజానా కాపుటోవా తీవ్రంగా ఖండించారు. ప్రధాని త్వరితగతిని కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని రాబర్ట్ ఫికో.. రష్యా అనుకూల విధానాన్ని అవలంభిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.