బ్రస్సెల్స్: బెల్జియం కార్నివాల్లో విషాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక కారు జనంపైకి దూసుకెళింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు 50 కిలోమీటర్ల దూరంలోని స్ట్రెపీ-బ్రాక్వెగ్నీస్లో ఈ ఘటన జరిగింది. కరోనా నేపథ్యంలో రెండేండ్ల విరామం తర్వాత కార్నివాల్ వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి. దీంతో సుమారు 150 మందితో అక్కడ కోలాహలం నెలకొన్నది. ఇంతలో ఒక కారు వేగంగా వెనక్కి ప్రయాణించింది. గుమిగూడి ఉన్న కొందరిపైకి అది దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా సుమారు 12 మంది గాయడిపట్లు ఆ నగర మేయర్ జాక్వెస్ గోబర్ట్ తెలిపారు. కారు డ్రైవర్‌తోపాటు అందులో ఉన్న మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
మరోవైపు పోలీసులు వెంటపడటంతో ఆ కారు వేగంగా వెనక్కి వచ్చి జనంపైకి దూసుకెళ్లినట్లు మీడియా కథనాలు వచ్చాయి. అయితే ఆ దేశ అధికారులు దీనిని ఖండించారు. కాగా, ఎంతో ఆనందంగా జరుగాల్సిన కార్నివాల్ విషాదంగా మారిందని బెల్జియం మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కింగ్ ఫిలిప్, ప్రధాన మంత్రి అలెగ్జాండర్ డి క్రూ, స్ట్రెపీని సందర్శించనున్నట్లు పేర్కొన్నారు.