Sirikit : సంప్రదాయ చేతి వృత్తులను, అడవులను రక్షించేందుకు కృషిచేసిన థాయ్‌లాండ్ (Thailand) ‘క్వీన్ మదర్ (Queen mother)’ సిరికిట్ కిటియాకర (Sirikit Kitiyakara) శనివారం కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు 93 ఏళ్లు. ఈనెల 17 నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బ్యాంకాక్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్సపొందుతూ మరణించారని ది రాయల్ హౌస్‌హోల్డ్ బ్యూరో ప్రకటించింది.
స్వతహాగా ప్రభావవంత మహిళ అయిన సిరికిట్ పుట్టినరోజును థాయ్‌లాండ్ ప్రజలు మాతృదినోత్సవంగా జరుపుకుంటారు. 1932 ఆగస్టు 12న ఓ ధనిక కుటుంబంలో సిరికిట్ జన్మించారు. 1950లో ఆమె అప్పటి రాజు భూమీబల్ అదుల్యతేజ్ను వివాహమాడారు. వీరికి ప్రస్తుత థాయ్‌లాండ్ రాజు మహా వజిరాలాంగ్కార్న్ సహా నలుగురు సంతానం ఉన్నారు.
గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన రాయల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో కొన్నింటిని సిరికిట్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. వెనుకబడిన, పేద ప్రజల ఆదాయాన్ని పెంచడానికి, అంతరించిపోతున్న చేతి వృత్తులను సంరక్షించడానికి 1976లో ‘సపోర్ట్ ఫౌండేషన్‘ను ప్రారంభించారు. అంతరించిపోతున్న సముద్ర తాబేళ్లను కాపాడేందుకు వన్యప్రాణుల పెంపక కేంద్రాలు, బహిరంగ జంతు ప్రదర్శనశాలలను ఏర్పాటుచేశారు. అందుకే సిరికిట్ను గ్రీన్ క్వీన్‌గా పిలుస్తారు.