సింగపూర్: పాకిస్థాన్‌లోని రాజకీయ నేతలు పనికిమాలినవారని, ప్రస్తుత సంక్షోభాలకు అక్కడి నాయకత్వం, మిలిటరీయే కారణమని సింగపూర్ మాజీ దౌత్యవేత్త కౌసికన్ తీవ్ర విమర్శలు చేశారు. ఒక అంతర్జాతీయ సదస్సులో పాక్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, 1991 నాటి సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ ఘటనను దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. ఆ ఏడాది మార్చి 26న కౌలాలంపూర్ నుంచి బయలుదేరిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని నలుగురు పాకిస్థానీ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. 114 మంది ప్రయాణికులు ఉన్న ఆ విమానాన్ని సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయంలో ల్యాండ్ చేయించారు.
పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోతో మాట్లాడించాలని వారు పట్టుబట్టారు. దీంతో ఆనాటి రాయబారి కౌశికన్ తెల్లవారుజామున మూడు గంటలకు భుట్టో నివాసానికి ఫోన్ చేశారు. అయితే అక్కడున్న వ్యక్తి ‘మేడమ్ పడుకున్నారు. ఆమెకు భంగం కలిగించలేం’ అని చెప్పారు.నాడు చర్చలు విఫలం కావడంతో సింగపూర్ కమాండోలు రంగంలోకి దిగి విమానంలోకి చొరబడి, నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు.