Pakistan : పాకిస్తాన్లో మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా ఒక సిక్కు జంట దారుణ హత్యకు గురైంది. గురుద్వారాను నిర్వహిస్తున్న దంపతుల్ని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్, మర్దాన్ జిల్లా, బాబూ మొహల్లాలో బుధవారం జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కడ ఒక గురుద్వారాను జగన్నాథ్, అస్మావాంటి అనే సిక్కు దంపతులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఆ గురుద్వారాలోకి దుండగులు ఆయుధాలతో ప్రవేశించారు. సిక్కు దంపతులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన దంపతులు అక్కడికక్కడే మరణించారు. అనంతరం దుండగులు అక్కడినుంచి పారిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దీనిపై మర్దాన్ జిల్లా పోలీస్ అధికారి మసూద్ అహ్మద్ స్పందించారు. దీనిపై విచారణ జరుగుతోందని, నిందితుల్ని పట్టుకుంటామని తెలిపారు. అలాగే, ఈ కాల్పులకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ హత్య స్థానిక సిక్కు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఈ ఘటనను స్తానిక సిక్కు ప్రజలు, సంఘాలతోపాటు రాజకీయ నేతలు కూడా ఖండించారు. ఖైబర్ పక్తుంఖ్వా స్పీకర్ సురేష్ కుమార్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీలో రికార్డైన దృశ్యాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దగ్గర్లోనే పోలీసులు, భద్రత ఉన్నప్పటికీ ఈ హత్య ఎలా జరిగిందని ప్రశ్నించారు.
దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ విచారణ సంస్థలు సరిగ్గా స్పందించకుంటే.. మర్దాన్, పెషావర్, ఇస్లామాబాద్‌లలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఈ హత్య కేసు విచారించేందుకు ప్రత్యేక పోలీసు బలగాల్ని మోహరించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనను సిక్కు సంస్థ అయిన అకాల్ తక్త్ జతేదార్ గియాని కుల్దీప్ సింగ్ ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇండియా నుంచి కూడా బీజేపీ స్పందించింది. పాకిస్తాన్లో మైనారిటీలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. వారికి రక్షణ కల్పించాలని బీజేపీ ఎంపీ తరుణ్ చుగ్ కోరారు.