Kamala Harris | అరిజోనా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా అరిజోనాలో అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ఘటనపై ఆ కార్యాలయంలోని సిబ్బంది అందించిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.
దుండగులు కమలా హారిస్ ప్రచార కార్యాలయం కిటికీల వద్ద నుంచి కాల్పులు జరిపినట్టు తెలుస్తున్నదని, దీంతో ఆ కార్యాలయంలోని కిటికీలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయని వివరించారు. కాల్పులు జరిగినప్పుడు కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. కానీ, ఈ ఘటన వల్ల ఆ కార్యాలయ సిబ్బందితోపాటు ఆ చుట్టుపక్కల నివసిస్తున్నవారి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ర్యాన్ కుక్ చెప్పారు.