Donald Trump : హార్ముజ్ జలసంధి పరిధిలో మందుపాతరలు అమర్చేందుకు ప్రయత్నించే ఏ నౌకనైనా పేల్చేయాలి అని అమెరికన్ నేవీని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. అంతేకాదు.. ఆ నౌకలోని సిబ్బందిని సైతం అంతం చేయాలని సూచించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా గురువారం ఈ అంశంపై ప్రకటన చేశారు.
హార్ముజ్ జలసంధి పరిధిలో, సముద్రంలో ఇరాన్ భారీ స్థాయిలో మందుపాతరలు అమర్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ‘‘హార్ముజ్ జలసంధి వద్ద సముద్రం లోపల మందుపాతరలు అమర్చేందుకు ప్రయత్నించే ఏ నౌకనైనా, చిన్న బోటు అయినా.. పేల్చేయాలని అమెరికన్ నేవీని ఆదేశించా. అందులోని సిబ్బందిని కాల్చి చంపమన్నా. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అంతేకాదు.. మా మైన్ స్వీపర్స్ హార్ముజ్‌లోని మైన్స్ తొలగిస్తున్నారు. ఈ పని మూడురెట్లు వేగంతో కొనసాగుతుంది’’ అంటూ ట్రంప్ ప్రకటించారు. హార్ముజ్ వద్ద అమర్చిన మైన్స్‌ను తొలగించే ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది. అయితే, చర్చల విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. చర్చలకు అమెరికా సిద్ధంగానే ఉన్నప్పటికీ.. ఇరాన్ మాత్రం అమెరికా డిమాండ్లను అంగీకరించడం లేదు. శుక్రవారమే చర్చలు జరుగుతాయని ట్రంప్ ప్రకటించినప్పటికీ.. ఇరాన్ ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.