నారా: జపాన్ మాజీ ప్రధాని షింజే అబే హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయనపై ఇవాళ నారా పట్టణంలో కాల్పులు జరిగాయి. ఓ ఆగంతకుడు వెనుక నుంచి వచ్చి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. అయితే ఓ బుల్లెట్ షింజో అబే గుండె లోతుల్లోకి వెళ్లినట్లు డాక్టర్లు గుర్తించారు. నారా మెడికల్ వర్సిటీలో ఆయన చికిత్స అందించారు. గుండె లోతుల్లో బుల్లెట్ వెళ్లడం వల్ల ఆయన్ను రక్షించలేకపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
చాలా తీవ్రమైన రీతిలో రక్తస్త్రావం జరిగిందని, బ్లీడింగ్‌ను ఆపలేకపోయామని డాక్టర్లు తెలిపారు. ఇవాళ సాయంత్రం 5.03 నిమిషాలకు ( అక్కడి కాలమానం ప్రకారం ) షింజో అబే తుది శ్వాస విడిచినట్లు డాక్టర్లు చెప్పారు. అబేను హాస్పిటల్‌కు తీసుకువచ్చిన సమయంలో ఆయన శరీరం స్పందించలేదని డాక్టర్లు తెలిపారు. గుండెకు పెద్ద రంధ్రం పడడం వల్ల బ్లీడింగ్‌ను ఆపడం కష్టంగా మారిందన్నారు. సుమారు 20 మంది వైద్య సిబ్బంది షింజో అబే ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశారు.
అబేను కాపాడేందుకు డాక్టర్లు సుమారు నాలుగున్నర గంటల పాటు పోరాడారు. బ్లడ్ ట్రాన్స్‌ప్యూజన్ చేశారు. సుమారు వంద యూనిట్ల రక్తాన్ని వాడారు. అబే శరీరంపై రెండు గాయాలు ఉన్నాయని, అవి బుల్లెట్ల వల్ల కలిగినట్లు అనిపించినా.. సర్జరీలో ఆ బుల్లెట్లు డాక్టర్లకు దొరకలేదని తెలుస్తోంది.