కాఠ్మాండూ: ఎవరెస్ట్ పర్వతంపై పనిచేసే షెర్పాలు పర్వతారోహకుల ఆహారంలో బేకింగ్ సోడా కలిపి భారీ ఇన్సూరెన్స్ కుంభకోణానికి పాల్పడ్డారు. అస్వస్థతకు గురైన పర్వతారోహకులను హెలికాప్టర్లలో వైద్యం కోసం దవాఖానలకు తరలించడం ద్వారా రూ.186 కోట్ల ఇన్సూరెన్స్ కుంభకోణానికి పాల్పడినట్టు కాఠ్మాండూ పోస్ట్ తెలిపింది. ఈ కేసులో 32 మందిపై నేపాల్ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
వీరిలో ట్రెక్కింగ్ కంపెనీ యజమానులు, హెలికాప్టర్ ఆపరేటర్లు, దవాఖాన ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. బేకింగ్ సోడా కలిపిన ఆహారం తిన్న పర్వతారోహకులు అనారోగ్యానికి గురి కాగానే వారిని అత్యవసరంగా హెలికాప్టర్ ద్వారా దవాఖానకు తరలించాలని షెర్పాలు ఒత్తిడి చేసేవారు. ఫోర్జరీ చేసిన వైద్య, హెలికాప్టర్ ప్రయాణ పత్రాలను సృష్టించి అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలను మోసగించేవారు.
ఇలా వచ్చిన సొమ్మును షెర్పాలు, ట్రెకింగ్ ఏజెన్సీలు, దవాఖానలు పంచుకొనేవి. జనవరిలో ఈ కుంభకోణంపై దర్యాప్తు మొదలైంది. రూ.103 కోట్లను నిందితుల నుంచి జరిమానా రూపంలో వసూలు చేయాలని ప్రాసిక్యూటర్లు భావిస్తున్నారు. 2018లో కూడా నేపాల్‌లో ఈ తరహా కుంభకోణం జరిగింది. దీంతో పలు అంతర్జాతీయ బీమా కంపెనీలు పర్వతారోహణ చేసే పర్యాటకులకు బీమా పాలసీల మంజూరును నిలిపేశాయి.