న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ మధ్య ప్రారంభమైన యుద్ధం క్రమంగా మధ్యప్రాశ్చం మొత్తానికి విస్తరిస్తున్నది. హమాస్, హెజ్బొల్లా గ్రూప్‌లను తుదముట్టించడమే లక్ష్యంగా నెతన్యాహూ (Benjamin Netanyahu) దళాలు ముందుకు సాగుతున్నాయి. దీంతో ఇప్పటికే వేలాది మంద్రి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఐడీఎఫ్ దాడుల ధాటికి లక్షలాది మంది నిరాశ్రయులై ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ఆయుధ విక్రయాలను నిలిపివేయాలంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పిలుపునిచ్చారు. రాజకీయ పరిష్కారమే కీలకమని భావిస్తున్నట్లు చెప్పారు. గాజాలో పోరాడటానికి ఇజ్రాయెల్‌కు తాము ఆయుధ విక్రయాలను ఆపేస్తున్నామని చెప్పారు. కాల్పుల విరమణ పిలుపును నెతన్యాహు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఇది ఇజ్రాయెల్ పొరపాటని, దాని భద్రతపై కూడా ప్రభావం చూపుతుందని తెలిపారు. యుద్ధం విద్వేషాలకు దారి తీసిందన్నారు. లెబనాన్ మరో గాజాలా మారకూడదని వెల్లడించారు. లెబనాన్‌లో సరిహద్దులకు దళాలను పంపాలన్న నెతన్యాహు నిర్ణయాన్ని మాక్రాన్ తప్పుపట్టారు.
దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాక్రాన్ నిర్ణయాన్ని ఖండించారు. ఇరాన్ నేతృత్వంలోని అరాచక శక్తులతో ఇజ్రాయెల్ పోరాడతున్నదని, అందువల్ల ఇజ్రాయెల్ వైపు ప్రపంచం నిలవాలన్నారు. కానీ, మాక్రాన్‌తో సహా ఇతర పాశ్చాత్య నాయకులు ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరాపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటని మండిపడ్డారు. హెజ్బొల్లా, హమాస్, హౌతీలపై ఇరాన్ ఆయుధ నిషేధం విధిస్తుందా అని ప్రశ్నించారు. గతేడాది అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడుల్లో వేలాది మంది ఇజ్రాయెలి పౌరులు మరణించారు. అందుకే తాము గాజా, లెబనాన్‌లో పోరాడుతున్నామని చెప్పారు. పాశ్చాత్య దేశాలు తమకు అండగా నిలిచినా.. లేకున్నా ఈ యుద్ధం గెలిచే వరకు ఇజ్రాయెల్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
కాగా, లెబనాన్ రాజధాని బీరుట్‌లోని ఫ్రెంచ్ బహుళజాతి కంపెనీ టోటల్ ఎనర్జీస్ గ్యాస్ స్టేషన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో స్టేషన్లో భారీ అగ్నిప్రాంతం జరిగింది. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి.