Lebanon Explosions | లెబనాన్‌లో బుధవారం మరోసారి వరుస పేలుళ్లు సంభవించాయి. ఇంతకు ముందు పేజర్ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా రేడియో సెట్స్ వంటి కొన్ని పరికరాల్లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు పేలుడు ఘటనల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయగా.. 300 మందికిపైగా గాయపడ్డనట్లు స్థానిక మీడియా తెలిపింది. బీరూట్‌లో హిజ్బుల్లా సభ్యులు, పేజర్ పేలుడులో మరణించిన చిన్నారి అంత్యక్రియల సమయంలో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇంతకు ముందు జరిగిన పేజర్ పేలుళ్లలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 2700 మందికిపైగా గాయపడ్డ విషయం తెలిసిందే.
మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు హిజ్బుల్లా సభ్యులు, ఓ చిన్నారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న స్థలంలో భారీగా పేలుళ్లు జరిగినట్లు సంభవించాయి. లెబనీస్ స్టేట్ మీడియా ప్రకారం.. బెకా లోయలోని సోహ్మోర్ పట్టణంలో గుర్తుతెలియని వైర్లెస్ పరికరాల పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. లెబనాన్‌లోని అనేక ప్రాంతాల్లో అనేక పేలుళ్లు జరిగాయి. డజన్ల కొద్దీ ప్రజలు గాయపడినట్లు మీడియా నివేదించింది. సమాచారం ప్రకారం.. రేడియో సెట్, వాకీ టాకీల్లో పేలుడు జరిగినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో వరుస పేలుళ్లతో ఏం జరుగుతుందో తెలియక జనం ఆందోళనకు గురవుతున్నారు.