Life Bank | ఫ్లోరిడా, ఆగస్టు 8: అంతరించిపోతున్న దశలో ఉన్న 10 లక్షల జాతులు జీవరాశులను బతికించాలన్న ఉద్దేశంతో శాస్త్రవేత్తలు చంద్రుడిపై లైఫ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. భూమిపై ప్రమాదంలో ఉన్న జీవాల కణాలను చంద్రుడిపైకి తరలించి, వాటిని రక్షించాలని నిర్ణయించారు.
దీనిలో భాగంగా డీఎన్ఏ, విత్తనాలు, కణాలు, కణజాలాలను ద్రవ నైట్రోజన్‌ను ఉపయోగించి ఘనీభవింపజేసి.. చంద్రుడిపైకి తరలిస్తారు. చంద్రుడి ఉపరితలంపై ఎలాగూ ఉష్ణోగ్రత -180 డిగ్రీల నుంచి -230 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి జీవ పదార్థాలు భద్రంగా ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఫిబ్రవరి వరకు ఐఎస్ఎస్లోనే సునీతా విలియమ్స్!
వాషింగ్టన్, ఆగస్టు 8: అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ల అంతరిక్ష ప్రయాణం.. అనుకోని ఆటంకాలను ఎదుర్కొంటున్నది. తొలుత 8 రోజులు అనుకున్న ఈ మిషన్.. చివరికి 8 నెలలకు దాకా ఎటూ తేలేట్టు కనపడటం లేదు. ఇద్దరు వ్యోమగాముల్ని 2025 ఫిబ్రవరిలో భూమి మీదకు తీసుకొచ్చేందుకు రకరకాల ఆప్షన్లను నాసా ఆలోచిస్తున్నదట! ఈ ఏడాది జూన్‌లో బోయింగ్ కంపెనీకి చెందిన ‘స్టార్ లైనర్’ రాకెట్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు పంపింది. . అయితే స్టార్ లైనర్‌లో హీలియం లీకేజ్ కారణంగా ప్రపొల్షన్ సిస్టంలో సమస్యలు తలెత్తాయి. దీంతో వారి తిరుగు ప్రయాణం నిలిచిపోయింది.
26న స్పేస్ ఎక్స్ పోలారిస్ డాన్ ప్రయోగం
వాషింగ్టన్, ఆగస్టు 8: ప్రైవేట్ రంగ అంతరిక్ష సంస్థ ‘స్పేస్-ఎక్స్’ ఆగస్టు 26న చరిత్రాత్మక ప్రయోగాన్ని చేపట్టబోతున్నది. పొలారిస్ డాన్‌గా పేర్కొంటున్న ఈ మిషన్‌లోని వ్యోమగాములు అంతరిక్షంలో ‘స్పేస్ వాక్’ చేయనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని దాటి.. భూమికి దాదాపు 700 కిలోమీటర్ల ఎత్తులోకి వ్యోమగాముల్ని తీసుకెళ్తారు. అపోలో మిషన్ తర్వాత మరే ప్రాజెక్ట్‌లోనూ మానవులను ఇంత ఎత్తుకు తీసుకెళ్లలేదు. అంతేగాక, అపోలో తర్వాత ఓ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ వాక్ చేపట్టనుండటం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని ఆ ప్రాజెక్ట్ బృందం సోషల్ మీడియా ‘ఎక్స్’లో తాజాగా వెల్లడించింది.
నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన సవతి బామ్మ కిమ్ సోంగ్ ఆయే నివసించిన భారీ భవంతిని నేలమట్టం చేయించారు. ఈ రాజ భవనాన్ని నిర్వహించేందుకు అవసరమైనంత సొమ్ము లేకపోవడమే దీనికి కారణమని చెప్తున్నారు. అయితే వీరిద్దరికీ పొసగేది కాదని కూడా అంటున్నారు. ఆమె భర్త 1994లో మరణించిన తర్వాత ఆమెను గృహ నిర్బంధంలో 2014లో మరణించారు. ఆమె నివసించిన రాజప్రాసాదాన్ని కిమ్ జోంగ్ ఉన్ నేలమట్టం చేయడంలోని ఆంతర్యమేమిటో తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. విల్లాలను కూల్చేయడం ఈ రాజ వంశానికి కొత్త కాదని వారు పేర్కొంటున్నారు.