Python | న్యూయార్క్, ఆగస్టు 22: కార్డియాక్ ఫైబ్రోసిస్ లాంటి గుండెజబ్బులను నయం చేయడానికి పైథాన్లు ఉపయోగపడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బౌల్డర్లోని కొలరాడో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పైథాన్లపై అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా ఒక పైథాన్కు 28 రోజుల పాటు ఆహారం ఏమీ ఇవ్వకుండా ఉంచి, తర్వాత దాని శరీర బరువులో పావు వంతు బరువైన ఆహారాన్ని అందించారు. ఇలా ఆహారాన్ని ఇచ్చినప్పుడు మిగతా పాముల కంటే ఈ పాము శరీరంలో గణనీయ మార్పులు వచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
మయోఫిబ్రిల్స్గా పిలిచే గుండె కండరంలో చాలా మార్పు వచ్చిందని, 24 గంటల్లో 25 శాతం మేర గుండె వ్యాకోచించిందని, గుండె కణజాలం సైతం మృదువుగా మారిందని, పల్స్ రెట్టింపు అయ్యిందని తేల్చారు. ఈ ప్రక్రియలో అనేక ప్రత్యేకమైన జన్యువులు ఉత్తేజితమై పాములో జీవక్రియను పెంచినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఆహారం పూర్తిగా జీర్ణమైన రెండు వారాల తర్వాత పాములోని అన్ని వ్యవస్థలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ గుండె మాత్రం కొంత పెద్దగా, బలంగా మారినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మనుషుల్లో కార్డియాక్ ఫైబ్రోసిస్ వంటి గుండె సమస్యలు వచ్చినప్పుడు గుండె కణజాలం బిగుసుకుపోతుంది. ఇలాంటి వారికి చికిత్సలో పైథాన్లు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
సాధారణంగా వైద్య ప్రయోగాలు ఎలుకలపై ఎక్కువగా చేస్తారు. కొలరాడో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త లెస్లీ లీన్వాండ్ మాత్రం రెండు దశాబ్దాలుగా పాములపై అధ్యయనం చేస్తున్నారు. మనుషుల గుండెలకు ప్రమాదకరంగా మారే వాటి నుంచి రక్షణ కల్పించే వ్యవస్థలు పైథాన్లకు ఉన్నట్టు ఆమె తెలిపారు.
ఇవి ఆహారం లేకుండా కొన్ని నెలల పాటు ఉండగలవని, ఒక్కోసారి ఏడాది వరకు ఉంటాయని చెప్పారు. అయితే, ఆహారం దొరికినప్పుడు మాత్రం దాని శరీర బరువు కంటే ఎక్కువ ఆహారాన్ని కూడా తింటాయని, అయినప్పటికీ దానికి ఎలాంటి నష్టం జరగదని అన్నారు.