Mars | న్యూయార్క్: మానవులు నివసించేందుకు అంగారక గ్రహం కొంత అనువుగా ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సైతం 2050 నాటికి అంగారకుడిని నివాసయోగ్యంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఈ గ్రహంపై విపరీతంగా ఉండే చలి వాతావరణం ఈ ఆలోచనలకు సవాల్ విసురుతున్నది. ఈ నేపథ్యంలో అమెరికాలోని నార్త్‌వెస్టర్న్, గ్లాస్గో యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు ఓ వినూత్న ప్రతిపాదన చేశారు. అంగారకుడిని వేడి చేసి, అక్కడి వాతావరణాన్ని మానవులు నివసించేందుకు అనుకూలంగా మార్చవచ్చని అంటున్నారు.
అంగారకుడిపై ఉండే ధూళిని పెద్ద ఎత్తున వాతావరణంలోకి పంపించడం ద్వారా ఈ గ్రహానికి వేడిని గ్రహించే శక్తి పెరుగుతుందని వీరు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఎలాగైతే భూమికి నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్ పని చేస్తుందో, అలాగే అంగారకుడిపై అక్కడి ధూళిని వాతావరణంలోకి పంపించడం ద్వారా వేడి చేయవచ్చని తెలిపారు. ఇనుము, అల్యూమినియంతో కూడిన ధూళిని ఒక సెకనుకు 10 లీటర్ల చొప్పున వాతావరణంలోకి పంపించడం ద్వారా ఒక దశాబ్దంలో -85 ఫారన్‌హీట్ డిగ్రీల నుంచి 86 ఫారన్‌హీట్ డిగ్రీలకు అంగారకగ్రహంపై ఉష్ణోగ్రతను మార్చవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం ఏడాదికి 2 కోట్ల టన్నుల ధూళి కణాలు కావాలని, వీటికి కావాల్సిన ముడి పదార్థాలు అంగారకుడిపైనే దొరుకుతాయి కాబట్టి సులువుగా తయారుచేయవచ్చని తెలిపారు.