వాషింగ్టన్, సెప్టెంబర్ 28: చంద్రుడిపైకి వేగంగా దూసుకొస్తున్న ఓ ఆస్టరాయిడ్‌ను అణు బాంబు దాడితో తుత్తునియలు చేయాలని ‘నాసా’ భావిస్తున్నది. రోదసిలో ‘వైఆర్4’ అనే ఆస్టరాయిడ్ చంద్రుడిని 2032లో ఢీకొట్టబోతున్నదని సైంటిస్టులు అంచనావేస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు ఒక మెగాటన్ న్యూక్లియర్ బాంబ్‌ను ఆస్టరాయిడ్‌పై ప్రయోగించాలని నాసా సైంటిస్టులు చెబుతున్నారు.
60మీటర్ల వెడల్పున్న ఈ ఆస్టరాయిడ్ ఒకవేళ చంద్రుడిని ఢీకొడితే.. దీని శకలాలు రోదసిలోకి దూసుకొస్తాయి. ఇవి చంద్రుడు, భూమి చుట్టూ తిరుగుతున్న అనేక శాటిలైట్స్, అంతరిక్ష కేంద్రాలను తాకే ముప్పు పొంచివుంది. చిన్న చిన్న పరిమాణంలోనివి కొన్ని భూమిని కూడా తాకొచ్చు.
న్యూక్లియర్ బాంబు కాకుండా మరో ఆప్షన్.. ‘కైనటిక్ ఇంపాక్టర్’తో ఆస్టరాయిడ్ దిశను మార్చొచ్చు. అయితే ఇందులో చాలా రిస్క్ ఉందని, మన అంచనా తప్పి.. ఆస్టరాయిడ్ భూమి మీదకు దూసుకొచ్చే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరించారు. ఆస్టరాయిడ్ కచ్చితంగా చంద్రుడిని ఢీకొనే అవకాశముంటే.. అణు బాంబు దాడి ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు.