బెర్న్: రోబోల రాకతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం అనేక శస్త్రచికిత్సలు రోబోలే నిర్వహిస్తున్నాయి. తాజాగా స్విట్జర్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త మినీ రోబోలను అభివృద్ధి చేశారు. శరీరంలోకి ప్రవేశించి రోగాన్ని నయం చేసే ఈ బుల్లి రోబోలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇవి రక్తంలో ప్రవహిస్తూ కోరిన చోటకు ఔషధాన్ని చేరవేస్తాయి. పందులపై జరిపిన పరీక్షల్లో సత్ఫలితాలు వచ్చాయని, 95 శాతం కేసుల్లో అనుకున్న చోటకే ఈ రోబోలు ఔషధాన్ని చేరవేశాయని పరిశోధకులు తెలిపారు. త్వరలోనే మనుషులపై వీటిని పరీక్షించనున్నట్టు చెప్పారు.
శరీరంలో ఔషధం ఎక్కడ అవసరమో కచ్చితంగా అక్కడికే ఔషధాన్ని చేరవేయడం సవాలుతో కూడుకున్నది. ఇందుకు మెరుగైన పద్ధతుల కోసం శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం చాలా వ్యాధులకు ఎక్కువ డోస్‌తో కూడిన మందులు ఇచ్చి, శరీరమంతా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తున్నది. దీని వల్ల దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి.
ఈ సమస్యకు ఈ మినీ రోబోలు పరిష్కారం చూపుతాయని భావిస్తున్నారు. ఈ రోబోలు వాటంతట అవే నడవవు. బయటి నుంచి మ్యాగ్నెట్ ద్వారా వైద్యులు వీటిని ఆపరేట్ చేస్తారు. తద్వారా ఇవి శరీరంలో కోరిన చోటకు ఔషధాన్ని తీసుకువెళ్తాయి. వేగంగా ప్రవహించే రక్తానికి వ్యతిరేకంగానూ ఇవి ఈదగలవు. సెకనుకు 20 సెంటీమీటర్ల మేర కదలగలవు. వీటి రాకతో హెవీ డోస్ ఇంజెక్షన్ల అవసరం తప్పుతుందని వైద్యులు భావిస్తున్నారు. మనుషులపై పరీక్షలు పూర్తయితే, త్వరలోనే ఇవి హాస్పిటళ్లలో అందుబాటులోకి రానున్నాయి.