అప్పుడెప్పుడో రాకాసి బల్లులు భూమండలాన్ని ఏలిన కాలంలో ఆకాశాన్ని తమ అదుపులో ఉంచుకున్న రాకాసి పక్షులు ‘టెరోసార్లు’. ఈ భారీ రాకాసి పక్షుల గురించి తాజాగా శాస్త్రవేత్తల దిమ్మతిరిగిపోయే అంశం బయటపడింది. స్కాట్లాండ్లోని ఐజిల్ ఆఫ్ స్కై అనే ప్రాంతంలో ఒక టెరాసర్ శిలాజం లభించింది. ఇది కనీసం 170 మిలియన్ సంవత్సరాల క్రితానికి చెందినదని శాస్త్రవేత్తల అంచనా.
ఇక్కడ సైంటిస్టుల బుర్ర పాడు చేసిన అంశం ఏంటంటే.. ఈ శిలాజం సైజు. ఈ టెరోసార్కు ‘‘జార్క్ స్కిఆన్యాచ్’’ అని పేరు పెట్టారు. గేలిక్ భాషలో దీని అర్థం ‘‘ఎగిరే బల్లి’’. ఈ శిలాజం పెద్దగా చెడిపోకుండా దాదాపు పూర్తి టెరోసార్ ఆకృతి కలిగి ఉంది. టెరోసార్ల ఎముకలు డోలుగా ఉండటం వల్ల సాధారణంగా వాటి శిలాజాలు సరైన ఆకృతిలో లభించవు. ఎందుకంటే మిగతా డైనోసార్లతో పోలిస్తే టెరోసార్ల ఎముకలు త్వరగా భూమిలో కలిసిపోతాయి. కానీ జార్క్ విషయంలో అలా జరగలేదు. అలాగే ఇది రెక్కలు విప్పితే ఎనిమిది అడుగుల వెడల్సు ఉంటుందని సైంటిస్టులు చెప్పారు.
ఇప్పటి వరకు డైనోసార్ల యుగంపై జరిగిన పరిశోధనలు చేసిన సైంటిస్టుల ప్రకారం, జార్క్ కాలంలో ఇంత పెద్ద టెరోసార్లు లేవు. కనీసం మరో 50 మిలియన్ సంవత్సరాల తర్వాతే దీని సైజు రాకాసి పక్షులు కనిపించాయి. ఈ విషయమే సైంటిస్టులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు, జార్క్ పూర్తిగా ఎదిగిన రాకాసి పక్షి కూడా కాదట. ఇది పూర్తిగా ఎదిగి ఉంటే కనీసం మరో రెండు అడుగుల వెడల్పు పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
జార్క్ కాలం నాటి టెరోసార్లలో ఇది అత్యంత పెద్దదని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే ఆ తర్వాతి కాలంలో అంటే సైంటిస్టుల భాషలో క్రెటాషియస్ కాలంలో టెరోసార్లు సైజు భారీగా పెరిగింది. ఒక్కోటి ఫైటర్ జెట్ విమానం అంత సైజులో ఉండేవి. ఇప్పుడు జార్క్ శిలాజాన్ని చూస్తే ఈ రాకాసి పక్షులు భారీ సైజులో పెరగడం సైంటిస్టులు అనుకున్న దానికంటే చాలా ముందుగానే మొదలైనట్లు తెలుస్తోంది.