Saudi Prince | సౌదీ అరేబియా ప్రధానమంత్రి, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ కూడా ధ్రువీకరించింది. సల్మాన్ సందర్శన కోసం పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. సౌదీ ప్రిన్స్ తన పర్యటనలో దివాలా అంచున ఉన్న పాకిస్తాన్‌కు దాదాపు 4.1 బిలియన్ డాలర్ల కొత్త రుణాన్ని ఇచ్చే ప్రకటన చేయనుండటమే షాబాజ్ షరీఫ్ ఎదురుచూపులకు కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ నేపథ్యంలో పాకిస్తాన్లో గందరగోళం, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో పాకిస్తాన్లో పర్యటించడం సరైంది కాదని భావించిన సౌదీ ప్రిన్స్ సల్మాన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ముందస్తు ఎన్నికలకు డిమాండ్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్‌లో నిరసనకు దిగారు.
గత నెలలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. తన పర్యటనలో పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయం ప్రకటించకపోవడంతో ఉత్త చేతులతో తిరిగొచ్చాడు. అయితే, యువరాజు సల్మాన్ నవంబర్ నెలాఖరున ఇస్లామాబాద్ పర్యటనలో ఆర్థిక సాయం ప్రకటిస్తారని ఆశాభావంతో ఉన్నారు. అప్పటి నుంచి యువరాజు సల్మాన్ పర్యటన కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ పర్యటన అర్థాంతరంగా రద్దు కావడంతో షాబాజ్ షరీఫ్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. సౌదీ ప్రిన్స్ పర్యటన రద్దుపై పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. యువరాజు సల్మాన్ పర్యటన రద్దు కాలేదని, వాయిదా పడిందని మాత్రం వెల్లడించింది.