Medvedev | మాస్కో: మాస్కోపై ఉక్రెయిన్ దాడి చేస్తే, కీవ్ భద్రతకు హామీ ఇచ్చేవారు ఎవరూ ఉండరని రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదెవ్ శనివారం హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధంలో సోవియెట్ యూనియన్ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల 9న మాస్కోలో 80వ వార్షిక విజయోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా మాస్కోపై ఉక్రెయిన్ దాడి చేస్తే, ఆ మర్నాడు మే 10వ తేదీని చూడటానికి ఆ దేశ రాజధాని కీవ్ ఉంటుందనే హామీని ఎవరూ ఇవ్వలేరని మెద్వెదెవ్ చెప్పారు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్పందిస్తూ పూర్తి స్థాయి కాల్పుల విరమణకు తాము సిద్ధమని తెలిపారు.
క్రిమియా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో శుక్ర-శనివారాల మధ్య రాత్రి 10కిపైగా మిసైళ్లను, 170 డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా శనివారం ప్రకటించింది. మరోవైపు ఖర్కీవ్పై రష్యా డ్రోన్ దాడిలో 47 మంది గాయపడినట్లు రీజనల్ గవర్నర్ ఓలెహ్ తెలిపారు. 12 చోట్ల ఈ దాడులు జరిగాయని చెప్పారు.