నామ్‌పెన్, నవంబర్ 12: ఉక్రెయిన్ ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా ప్రపంచంతో రష్యా ఆకలి క్రీడ ఆడుతున్నదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా మండిపడ్డారు. రష్యాతో తాము చేస్తున్న పోరాటానికి రాజకీయ, వస్తుపరమైన సహకారం అందించాలని ఆగ్నేయాసియా దేశాలను కోరారు. ఆగ్నేయాసియా దేశాల సదస్సు (ఆసియాన్) సందర్భంగా శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధాన్యం, ఎరువులను ఎగుమతి చేసేందుకు ఉక్రెయిన్‌తో చేసుకున్న ఒప్పందం నవంబర్ 19న ముగుస్తున్నదని, దీని పొడిగింపునకు రష్యా అడ్డుచెప్పకుండా ఆ దేశంపై ఆగ్నేయాసియా దేశాలు ఒత్తిడి తేవాలని కులేబా కోరారు. ఆసియాన్ సదస్సుకు ఉక్రెయిన్ను తొలిసారి ఆహ్వానించారు.