మాస్కో: రష్యాలో యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్న విషయం తెలిసిందే. అయితే ఓ క్రైస్తవ మతబోధకుడు.. యుద్ధానికి వ్యతిరేకంగా ఉపన్యాసం చేశారు. ఈ ఘటనలో రష్యా పోలీసుల ఆ ఫాదర్ని అరెస్టు చేశారు. కరబనోవా గ్రామంలో స్థానిక ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగం చేశారు. యుద్ధం వల్ల కలిగే అనర్ధాల గురించి ఆయన ప్రసంగం చేశారు. ఉక్రెయిన్ నగరాలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన చిత్రాలను ఫాదర్ ఇయాన్ బర్డిన్ షేర్ చేశారు. ఈ నేపథ్యంలో రష్యా పోలీసులు క్రిమినల్ కేసు పెట్టారు. సాయుధ బలగాల చట్టాన్ని అతిక్రమించినట్లు ఆరోపించారు. ఉక్రెయిన్పై దాడి ప్రకటించిన తర్వాత రష్యాలో చెలరేగుతున్న ఆందోళనలను ఆ దేశ పోలీసులు అణిచివేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వివిధ నగరాల్లో 13వేల మందిని అరెస్టు చేశారు. ఆదివారం ఒక్క రోజే 4600 మందిని అదుపులోకి తీసుకున్నారు.