మాస్కో: క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) సంతాపం వ్యక్తం చేశారు. వాటికన్లో 88 ఏళ్ల ఫ్రాన్సిస్ ఇవాళ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఎన్నో సందర్భాల్లో అద్భుతమైన ఆ వ్యక్తితో సంభాషణలు చేసినట్లు పుతిన్ గుర్తు చేశారు. పోప్‌తో జరిగిన భేటీ తనకు ఎప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. ఫ్రాన్సిస్ తన హోదాలో .. రష్యన్ ఆర్థోడక్స్, రోమన్ క్యాథలిక్ చర్చి మధ్య సంప్రదింపులను ప్రోత్సహించినట్లు పుతిన్ వెల్లడించారు. వాటికన్, రష్యా మధ్య బంధాలు బలోపేతం అయ్యేలా చూశారన్నారు. క్రెమ్లిన్ వెబ్సైట్లో పుతిన్ తన సంతాపం సందేశాన్ని పోస్టు చేశారు.
క్రైస్తవ బోధనలకు విశ్వనీయమైన సేవకుడిగా పోప్ ఫ్రాన్సిస్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉన్నట్లు పుతిన్ తెలిపారు. తెలివైన మతతత్వవాది అని, రాజనీతిపరుడని, మానవత్వం.. న్యాయం విలువల కోసం నిత్యం పోరాడినట్లు చెప్పారు. పుతిన్, పోప్ ఫ్రాన్సిస్ మధ్య వ్యక్తికత బంధం ఉన్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పీస్కోవ్ తెలిపారు. ఆ ఇద్దరూ మూడు సార్లు పర్సనల్‌గా కలుసుకున్నట్లు చెప్పారు. 2013, 2015, 2019 సంవత్సరాల్లో వాటికన్ సిటీలో పుతిన్ పర్యటించినప్పుడు ఆ ఇద్దరూ భేటీ అయినట్లు తెలిపారు. చివరిసారి డిసెంబర్ 2021లో ఆ ఇద్దరూ ఫోన్లో సంభాషించినట్లు చెప్పారు.