Harry Potter | కీవ్, మే 1: ఉక్రెయిన్‌లో హ్యారీపోటర్ కోటపై రష్యా క్షిపణి దాడిచేసింది. పోర్టు సిటీగా పేరొందిన ఒడెస్సాలోని ఈ అందమైన కోట వాస్తవానికి ఒక విద్యా సంస్థ అయినప్పటికీ దానిని హ్యారీపోటర్ కోటగా వ్యవహరిస్తారు. స్కాటిష్ నిర్మాణ శైలిలో ఉన్న ఈ భవనం లక్ష్యంగా రష్యా జరిపిన ఈ దాడిలో ఐదుగురు మృతి చెందగా, 32 మంది గాయపడినట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
వీరిలో ఇద్దరు చిన్నారులు, ఒక గర్భిణీ ఉన్నారు. ఈ దాడితో చుట్టుపక్కల 20 నివాస భవనాలు దెబ్బతిన్నాయి. హ్యారీపోటర్ కోటలో మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇస్కందర్-ఎం-బాలిస్టిక్ క్షిపణిపై క్లస్టర్ వార్‌హెడ్ అమర్చి ఈ దాడి జరిపినట్టు ఉక్రెయిన్ నేవీ అధికారి ఒకరు తెలిపారు. క్షిపణి దాడితో శకలాలు దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం వరకు పడినట్టు ఆయన చెప్పారు. పౌరులను హతమార్చడానికే రష్యా ఈ ఆయుధాన్ని ప్రయోగించినట్టు అధికారులు ఆరోపించారు.