Russia | రష్యా మరోసారి రెచ్చిపోయింది. పండుగ వేళ సాధారణ ప్రజలే లక్ష్యంగా ఉక్రెయిన్పై క్షిపణులతో దాడి చేసింది. సుమీ నగరంపై జరిపిన ఈ దాడిలో 20 మందికి పైగా మృతిచెందారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మట్టల ఆదివారం సందర్భంగా స్థానికులంతా ఒక్కచోట చేరిన సమయంలో రెండు క్షిపణులతో రష్యా దాడి చేసింది.
సుమీ నగరంపై రష్యా చేసిన క్షిపణుల దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. సాధారణ పౌరులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని తెలిపారు. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు మరణించారని పేర్కొన్నారు. నివాస భవనాలు, విద్యాసంస్థలు, కార్లు వంటివి ధ్వంసమయ్యాయని చెప్పారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు. రష్యాపై ఒత్తిడి లేకుండా శాంతి స్థాపన చేయడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు.