న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు ఉక్రెయిన్ గుండా 40 ఏళ్ల నుంచి సరఫరా అవుతున్న గ్యాస్ బుధవారం నుంచి నిలిచిపోతున్నది. ఉక్రెయిన్‌లోని నఫ్టోగాజ్, రష్యాలోని గాజ్ప్రోమ్ మధ్య ఒప్పందం ముగియడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఒప్పందం 2020లో అమల్లోకి వచ్చింది. మొదట్లో ఈయూకు ఉక్రెయిన్ గుండా రష్యన్ గ్యాస్ సంవత్సరానికి 65 బిలియన్ క్యూబిక్ మీటర్లు సరఫరా అయ్యేది. అయితే, ఉక్రెయిన్-రష్యా యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఈయూకు గ్యాస్ సరఫరా భారీగా తగ్గిపోయి సంవత్సరానికి 14 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. తాము రష్యాయేతర పైప్లైన్ల ద్వారా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ను తెచ్చుకుంటామని యూరోపియన్ కమిషన్ ప్రకటించింది.
రష్యా మార్కెట్‌ను తన ప్రత్యర్థి దేశాలైన నార్వే, అమెరికా, ఖతార్ ఆక్రమించుకున్నాయి. ఉక్రెయిన్ గుండా ఈయూకు గ్యాస్ సరఫరా కొనసాగి ఉంటే ఈ ఏడాది రష్యాకు సుమారు 5 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చి ఉండేది. ఉక్రెయిన్‌కు 800 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు ఫీజు రూపంలో లభించి ఉండేది. ఉక్రెయిన్ రూట్లో సరఫరా నిలిచిపోవడంతో ముఖ్యంగా ఆస్ట్రియా, స్లోవేకియాలకు ఇబ్బందులు తప్పవు. అయితే, చెక్ రిపబ్లిక్, హంగరీ, పోలండ్ వంటి దేశాల నుంచి తమ అవసరాలకు అనుగుణంగా గ్యాస్‌ను తెచ్చుకుంటామని ఈ రెండు దేశాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
యూరోపియన్ యూనియన్‌కు రష్యా గ్యాస్ ఉక్రెయిన్ గుండా సరఫరా అయ్యే ఒప్పందం ముగియడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఘాటుగా స్పందించారు. మా రక్తంతో అదనపు డాలర్లను సంపాదించుకునే అవకాశాన్ని రష్యాకు ఇవ్వబోమని చెప్పారు. రష్యా గ్యాస్ రవాణా ఒప్పందాన్ని నిలిపేశామని, ఇది చారిత్రక సంఘటన అని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ గ్యాస్ సరఫరా స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటలకు నిలిచిపోయిందని తెలిపింది. దీనివల్ల రష్యా ఆర్థిక స్థితి బలహీనపడుతుందని ఉక్రెయిన్ ఆశిస్తున్నది. కానీ రష్యా మాత్రం ఉక్రెయిన్‌కే ఎక్కువ నష్టమని వాదిస్తున్నది.