మాస్కో: ఐరోపా దేశాలకు విమానాలను నడిపేది లేదని రష్యా (Russia) విమానయాన సంస్థ ఏరోఫ్లాట్ (Aeroflot ) ప్రకటించింది. సోమవారం నుంచి ఈయూలోని అన్ని దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో రష్యా విమానాలకు తమ గగనతలంలోకి ప్రవేశం లేదని యూరోపియన్ యూనియన్ (EU) స్పష్టం చేసింది.
ఐరోపా మీదుగా గానీ, ఐరోపా దేశాలకు విమానాలను నడపడానికి వీళ్లేదని వెల్లడించింది. దీంతో రష్యన్ ఎయిలైన్స్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నది. తదుపరి నోటీసులు వచ్చేవరకు ఇది అమల్లో ఉంటుందని తెలిపింది. దీంతో బ్రిటన్, లాట్వియా, లిథువేనియా, ఎస్టోనియా, స్లోవేనియా, బల్గేరియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్ వంటి అనేక దేశాల విమానాలపై ఏరోఫ్లాట్ నిషేధం విధించింది.
ఈ నిషేధం రష్యాకు చెందిన జెట్ విమానాలకు కూడా వర్తిస్తుందని ఈయూ వెల్లడించింది. కాగా, ఇప్పటికే ఈయూలోని 27 దేశాల్లో చాలా వరకు రష్యన్ విమానాలపై నిషేధం విధించింది. దీంతో ఇది ఇప్పటికే అమల్లో ఉన్నట్లయింది.