వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో అత్యాచారం, లైంగిక వేధింపుల ఘటనలు ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలకు సంబందించిన ఫిర్యాదులు యునైటెడ్ నేషన్స్‌కు అందుతున్నాయి. రష్యాకు చెందిన సాయుధ బలగాలు.. అత్యాచారాన్ని యుద్ధ ఆయుధంగా వాడుతున్నారని ఉక్రెయిన్ మానవ హక్కుల సంఘం తెలిపింది. ఉక్రెయిన్‌లోని లా స్ట్రాడా అనే సంస్థ హాట్‌లైన్‌కు ఎక్కువ సంఖ్యలో రేప్ బాధితుల కాల్స్ వస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు క్యాటరినా చెరిపాక తెలిపారు. రష్యా సైనికులు సుమారు 9 రేప్ కేసుల్లో ఉన్నారని, 12 మంది మహిళలు, అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉక్రెయిన్‌పై ఆక్రమణకు వెళ్లిన రష్యా దళాలు రేప్‌ను ఓ ఆయుధంగా వాడుతున్నట్లు ఆమె ఆరోపించారు. అయితే తామేమీ సాధారణ పౌరులను టార్గెట్ చేయడం లేదని ముందు నుంచి రష్యా చెబూతూనే ఉంది.
లైంగిక వేధింపుల కేసులను యూఎన్ హ్యూమన్ రైట్స్ పరిశీలిస్తున్నట్లు యూఎన్ తెలిపింది. గ్యాంగ్ రేప్‌తో పాటు చిన్నారుల ముందు రేప్ చేయడం, భర్తల ముందు భార్యల్ని రేప్ చేయడం లాంటి ఘటనల గురించి ఆరా తీస్తున్నట్లు యూఎన్ వెల్లడించింది. స్థానిక పౌర సాయుధ బలగాలు కూడా లైంగిక హింసకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుల్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి చెప్పింది. బాధితులకు న్యాయం చేకూరే వరకు వ్యక్తిగత విచారణ చేపట్టాలని యూఎన్ వుమెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీమా బాహోస్ తెలిపారు. ఉక్రెయిన్‌లో రేప్, సెక్సువల్ వాయిలెన్స్‌కు సంబంధించిన ఘటనల గురించి ఎక్కువగా వింటున్నామని ఆమె అన్నారు. రష్యా సైనికుల లైంగిక దాడుల గురించి ప్రత్యేక డాక్యుమెంట్ తయారు చేస్తున్నామని భద్రతా మండలిలో యూఎన్ అంబాసిడర్ సెర్గీ కిస్టిసా తెలిపారు.