US vs Russia : ఉక్రెయిన్-రష్యా (Ukraine-Russia) యుద్ధానికి తెరదించేందుకుగానూ మాస్కోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ఒత్తిడిని తీవ్రతరం చేశారు. ఈ క్రమంలోనే రష్యాకు చెందిన రెండు అతిపెద్ద చమురు కంపెనీలు రోస్నెఫ్ట్, లుకోయిల్‌పై ఆంక్షలు విధించారు. అయితే రష్యా దీన్ని తీవ్రంగా ఖండించింది. ఈ ఆంక్షలు బెడిసికొడతాయని రష్యా విదేశాంగశాఖ ప్రతినిధి మరియా జఖరోవా (Maria Zakharova) హెచ్చరించారు.
‘రష్యా చమురు సంస్థలపై అమెరికా విధించిన ఆంక్షలు మాస్కో కన్నా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థనే ఎక్కువగా దెబ్బతీస్తాయి. ఆంక్షలు విధించి జాతీయ ప్రయోజనాల విషయంలో రష్యా (Russia) ను రాజీపడేలా చేయలేరు. ఇలాంటి చర్యలు సఫలీకృతం కావు. పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని నిలబడే సామర్థ్యాన్ని మేం పెంపొందించుకున్నాం. ఆర్థిక, ఇంధన రంగాల్లో మరింత బలపడతాం’ అని జఖరోవా వ్యాఖ్యానించారు.
అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో శాంతి చర్చలను కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జఖరోవా తెలిపారు. ఈ విషయంలో పెద్ద అడ్డంకులేమీ లేవని, మీడియా లీక్‌లు, రాజకీయ దురుద్దేశంతో కూడిన ప్రకటనలు మానేసి, దౌత్యమార్గంలో పరస్పర గౌరవం, వాస్తవికతతో కూడిన చర్చలు జరగాలని అభిప్రాయపడ్డారు.