మాస్కో : ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో పలు దేశాలు, భారీ కార్పొరేట్ కంపెనీలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. అయితే, తమకు వ్యతిరేకంగా ఉన్న సంస్థలపై రష్యా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఈ క్రమంలో తాజాగా మెటా యాజమాన్యంలో ఇన్స్టాగ్రామ్ (Instagram )పై మాస్కో బ్యాన్ విధించింది. సోమవారం నిషేధం అమలులోకి వచ్చింది. అయితే, రష్యన్లపై దాడులకు ఉసిగొల్పేలా ఉన్న పోస్టులను ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా అనుమతి ఇస్తుందని రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. అధ్యక్షుడు పుతిన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ చేసిన పోస్టులను సైతం నియంత్రించడం లేదని ఆరోపించింది. రష్యన్ సైనికులపై దాడులు చేయాలంటూ వస్తున్న పోస్టులపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌ను రష్యా బ్యాన్ చేసింది. రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం మెటాను తీవ్రవాద సంస్థగా వర్గీకరించాలని రష్యా కోర్టును కోరినట్లు రష్యా స్వతంత్ర వార్తా సంస్థ ఇంటర్ఫాక్స్ సైతం తెలిపింది.
ఇంతకు ముందు మెటా పరిధిలో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌ను సైతం ఇటీవల రష్యా నిలిపివేసింది. బ్యాన్‌తో 8కోట్ల మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌కు దూరమయ్యారు. 80శాతం మంది రష్యన్లు ఇతర దేశాలకు చెందిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవుతున్నారు. రష్యాలో టిక్‌టాక్‌ను కంపెనీ పాక్షిక్షంగా నిషేధించింది. ప్రస్తుతం ఉన్న వీడియోలను చూసే వీలుండగా.. కొత్త వీడియోలను అప్లోడ్ చేసే అవకాశం అందుబాటులో లేదు. మైక్రోసాఫ్ట్ సేవలను నిలిపివేసినా.. యూట్యూబ్, టెలీగ్రామ్‌ను ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా నిషేధం నేపథ్యంలో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (VPN) కోసం రష్యాల డిమాండ్ పెరుగుతున్నది. ఇప్పటికే చైనా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పెద్ద ఎత్తున వీపీఎన్‌ను వినియోగిస్తున్నారు. సోషల్ మీడియాపై నిషేధం నేపథ్యంలో రష్యాలో వీపీఎన్ కోసం డిమాండ్ 668శాతం పెరిగింది.
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాలో పెద్ద సంఖ్యలో కంపెనీలు తమ సేవలను నిలిపివేయగా.. కొన్నింటిని రష్యా నిషేధించింది. ఇందులో మెటాకు చెందిన ఫేస్బుక్, ఇస్టాగ్రామ్, వాట్సాప్‌లను రష్యన్ మీడియా ఉపయోగించడం లేదు. అలాగే రష్యాలో ఈ ప్లాట్ఫారమ్లన్నింటిలో మానిటైజేషన్‌ను నిలిపివేశారు. రష్యన్ స్టేట్ మీడియా యూట్యూబ్ చానెల్ నుంచి ప్రకటనలను తొలగించింది. యూరప్‌లో, ఆర్టీ, స్పుత్నిక్‌కు సంబంధించిన స్టేట్ మీడియా ఖాతాలకు టిక్‌టాక్ యాక్సెన్‌ను మూసివేసింది. దీంతో టిక్‌టాక్ యూజర్లు కొత్త వీడియోలను ఇక అప్లోడ్ చేసే అవకాశం లేదు. తైవాన్‌కు చెందిన టీఎస్ఎంసీ రష్యాలో రూపొందించిన ఎల్బ్రస్ బ్రాండెడ్ చిప్‌లతో సహా రష్యన్ మార్కెట్లో అన్ని చిప్సెట్ల అమ్మకాన్ని నిషేధించింది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ రష్యన్ ప్రభుత్వ టెలివిజన్ చానళ్లను నిషేధించింది. అయితే కంపెనీ రష్యాతో వ్యాపారాలను మాత్రం కొనసాగిస్తున్నది. ప్రముఖ చిప్సెట్ తయారీ సంస్థ ఇంటెల్ రష్యాలో చిప్‌ల విక్రయాలను నిలిపివేసింది. వీటితో పాటు ఏఎండీ, డెల్, ఊబర్, బోల్ట్, స్నాప్‌చాట్, వీబర్, రొకు, మైక్రోసాఫ్ట్, నోకియా, యాపిల్ రష్యాలో సేవలను నిలిపివేశాయి.