Russia Invansion | రష్యా, ఉక్రెయిన్ మధ్య బెలారస్ సరిహద్దుల్లో సోమవారం జరిగిన శాంతి చర్చలు విఫలమైనా.. మరో దఫా చర్చలకు ఇరుదేశాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. చర్చల ప్రారంభానికి ముందు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ మీడియాతో మాట్లాడుతూ.. చర్చల కోసం వేచి ఉండమని తనకు ప్రభుత్వం నుంచి సూచన వచ్చిందన్నారు. సంప్రదింపుల దశలో ఉన్నట్లు తాను ప్రకటించలేనన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేసి సోమవారానికి ఐదు రోజులు పూర్తయ్యాయి.
మరో దఫా చర్చలకు ఉక్రెయిన్ అంగీకరించింది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అణ్వస్త్రాలను సిద్దం చేయాలని తన త్రివిధ దళాల అధిపతులను ఆదేశించారు. పుతిన్‌పై అమెరికా మండిపడింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నిలిచిపోయినందున పుతిన్ కృత్రిమ హెచ్చరికలు పని చేయవని వ్యాఖ్యానించింది.
తొలుత బెలారస్ సరిహద్దుల్లో చర్చలకు నిరాకరించినా తర్వాత ఉక్రెయిన్ వెనక్కు తగ్గింది. బెలారస్ అధినేత అలెగ్జాండర్ లుకాశెంకోతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కై ఫోన్ సంప్రదింపులు జరిగాయి. చెర్నోబిల్ అణ్వస్త్ర కేంద్ర జోన్‌కు బయట బెలారస్ – ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి.
క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని పశ్చిమ దేశాలు గుర్తించినప్పుడు మాత్రమే ఉక్రెయిన్ నుంచి తమ సైనిక బలగాలు వెనక్కు మళ్లుతాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు పుతిన్ స్పష్టం చేశారు. ఇక ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రపై చర్చించడానికి అత్యవసరంగా జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశానికి గైర్హాజరు కావాలని భారత్ నిర్ణయించుకున్నది. అయితే, రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలను భారత్ స్వాగతించింది.