మాస్కో: రష్యా మరో కొత్త హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను నాశనం చేసే సత్తా ఉన్న జిర్కాన్ క్షిపణిని బారెంట్స్ సముద్రం నుంచి ప్రయోగించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వర్గాల ద్వారా తెలిసిందని రాయిటర్స్ వార్తా సంస్థ శనివారం తెలిపింది. సుమారు 1,016 కిలో మీటర్ల (631 మైళ్ళు) దూరంలో ఉన్న తెల్ల సముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా ఛేదించినట్లు పేర్కొంది. గతంలో కూడా సముద్రం లోపల ఉన్న జలాంతర్గామి నుంచి జిర్కాన్ క్షిపణిని పరీక్షించినట్లు రష్యా తెలిపింది. అధునాతన క్షిపణులు, లేజర్ ఆయుధాలను కలిగి ఉన్న సాటిలేని కొత్త తరం ఆయుధ వ్యవస్థలలో జిర్కాన్ హైపర్సోనిక్ క్షిపణి ఒకటని రష్యా అధ్యక్షుడు పుతిన్ అభివర్ణించారు.
కాగా, గత నెలలో ఉక్రెయిన్లోని లక్ష్యాలపై కింజాల్ హైపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగించినట్లు రష్యా తెలిపింది. 1,500 నుంచి 2,000 కిలో మీటర్ల పరిధిలోని లక్ష్యాలను నాశనం చేయగల ఆయుధంగా పేర్కొంది. అలాగే గత నెలలో కొత్త అణ్వాయుధ సామర్థ్యం గల ఖండాంతర క్షిపణి సర్మత్ని రష్యా ప్రయోగించింది. పదికిపైగా అణ్వాయుధాలను అమెరికా వరకు మోసుకెళ్లే సామర్థ్యం ఉందని తెలిపింది.
మరోవైపు ఉక్రేనియన్ సైనిక దళాలు ప్రయోగించిన డ్రోన్లను పేల్చి వేసేందుకు శక్తివంతమైన కొత్త తరం లేజర్ ఆయుధం జదిరాను గత వారం ప్రయోగించినట్లు రష్యా తెలిపింది. అయితే యుద్ధ నిబంధనల ప్రకారం నిషేధించిన ఇలాంటి ఆయుధాలు ఉక్రేనియన్ డ్రోన్లు లేదా ఫిరంగి దళాలను నాశనం చేయడంతోపాటు సైనికులను అంధులుగా చేస్తాయని పశ్చిమ దేశాల సైనిక నిఫుణులు ఆందోళన వ్యక్తం చేశారు.