మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య డ్రోన్ దాడుల పరంపర కొనసాగుతున్నది. తమ వాయుసేన స్థావరాలను ఊహించని విధంగా దెబ్బకొట్టిన ఉక్రెయిన్‌పై.. రష్యా (Russia) 479 డ్రోన్లతో ప్రతీకార దాడులకు పాల్పడింది. దీంతో కీవ్ కూడా మాస్కోపై ఎదురుడులకు దిగింది. ఈ నేపథ్యంలో మాస్కోలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మాస్కోకు సేవలందిస్తున్న నాలుగు ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రష్యా పౌర విమానయాన సంస్థ రోసావియాట్సియా తెలిపింది. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేస్తున్నదని రక్షణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సోమవారం అర్ధరాత్రి కేవలం రెండు గంటల్లోనే రష్యా గగణతలంలో 76 ఉక్రేనియన్ డ్రోన్లను కూల్చివేసినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది.
రష్యా వాయుసేన స్థావరాలను ఊహించని విధంగా ఉక్రెయిన్ దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. దీంతో రష్యా ప్రతీకార దాడుల్ని మరింత ఉధృతం చేసింది. ఈ యుద్ధంలో మునుపెన్నడూ లేనంతగా 479 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ భీకరమైన దాడులకు దిగింది. ఉక్రెయిన్ మధ్య, పశ్చిమ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ రష్యా మిలిటరీ పెద్ద సంఖ్యలో డ్రోన్ దాడులు, 20 క్షిపణి దాడులు చేపట్టినట్టు ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. ఇందులో ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ 277 డ్రోన్లను, 19 మిస్సైల్స్‌ను అడ్డుకుందని తెలిపింది.