మాస్కో: రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరమైన మరియపోల్‌ను ఆక్రమించేసినట్లు రష్యా వెల్లడించింది. అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంట్ మినహా ఆ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇవాళ రష్యా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే స్టీల్ ప్లాంట్‌లో మాత్రం ఇంకా రెండు వేల మంది ఉక్రెయిన్ మిలిటెంట్లు ఉన్నట్లు రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ తెలిపారు.
మార్చిలో మరియపోల్‌ను చట్టుముట్టిన సమయంలో ఆ ప్లాంట్‌లో సుమారు 8 వేల మంది ఉక్రెయిన్ సైనికులు, విదేశీ దౌత్యవేత్తలు, మిలిటెంట్లతో పాటు అజోవ్ బెటాలియన్ ఉన్నట్లు మంత్రి తెలిపారు. సుమారు 1400 మంది మిలిటెంట్లు తమ ఆయుధాలను వదిలేశారన్నారు. ఆ నగరం నుంచి 1.42 లక్షల మందిని సురక్షితంగా తరలించినట్లు షొయిగూ తెలిపారు.
అయితే అజోవ్ స్టీల్ ప్లాంట్‌ను ఆక్రమించాలన్న ఆలోచనను విరమించాలని అధ్యక్షుడు పుతిన్ ఆదేశించినట్లు మంత్రి షొయిగూ చెప్పారు. కానీ ఆ ప్లాంట్‌ను సురక్షితంగా బ్లాక్ చేయాలని సూచించినట్లు వెల్లడించారు. ప్లాంట్ లోపల ఉన్న వారికి ఆయుధాలను విరమించేందుకు మరో అవకాశం ఇవ్వాలని పుతిన్ సూచించినట్లు చెప్పారు.
రష్యా దాడి చేపట్టిన తర్వాత మరియపోల్‌లో భీకర పోరు సాగిన విషయం తెలిసిందే. మరియపోల్‌లో విజయవంతంగా ఆపరేషన్ చేపట్టినందుకు పుతిన్ కంగ్రాట్స్ చెప్పినట్లు షొయిగూ తెలిపారు.