కీవ్, అక్టోబర్ 17: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా మరోసారి బాంబుల వర్షం కురిపించింది. వారం రోజుల క్రితం కీవ్‌తో పాటు పలు ఇతర నగరాలపై క్షిపణులతో దాడులు చేసిన రష్యా బలగాలు.. ఈ సారి ఆత్మాహుతి డ్రోన్లతో కీవ్‌పై విరుచుకుపడ్డాయి. కీవ్‌పై సోమవారం ఉదయం నిమిషాల వ్యవధిలోనే వరుసగా డ్రోన్ దాడులు జరిగాయి. మధ్య కీవ్‌లోని నివాస ప్రాంతాలపై ఆత్మాహుతి డ్రోన్లు దాడి చేసినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కార్యాలయ ప్రధాన అధికారి అండ్రీ యర్మాక్ పేర్కొన్నారు.
ఓ ఆర్నెల్ల గర్భిణితో సహా ముగ్గురు మరణించారని కీవ్ మేయర్ తెలిపారు. కీవ్ రీజియన్‌లో 13 డ్రోన్లను కూల్చివేసినట్టు ఉక్రెయిన్ సైన్యం అధికార ప్రతినిధి యూరీ ఇన్హాత్ తెలిపారు. ఉక్రెయిన్‌లోని పలు విద్యుత్తు సరఫరా కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని రష్యా తాజాగా చేసిన దాడులతో వందల పట్టణాల్లో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. మధ్య డ్నిప్రొపెట్రోవ్స్, ఈశాన్య సుమీ రీజియన్లలోని కీలక సదుపాయాలను లక్ష్యంగా రష్యా దాడులు చేసిందనిఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మిగల్ వెల్లడించారు.