బలగాలను ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి ఉపసంహరించామని పుతిన్ ప్రకటిస్తున్నారు. లేదు లేదు… మీ మీద మాకు విశ్వాసం లేదని, బలగాలు ఇంకా అక్కడే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, నాటో అధ్యక్షుడు విరుచుకుపడటం… వెరసి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. రష్యా తన బలగాలను ఉపసంహరించిందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతలోనే ఓ శాటిలైట్ ఛాయాచిత్రం బయటపడింది. రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో తన బలగాలను మోహరిస్తున్నట్లు ఈ శాటిలైట్ ఛాయాచిత్రంలో స్పష్టంగా కనపడుతోంది. తాము సరిహద్దు నుంచి బలగాలను వెనక్కి పంపించామన్న రష్యా వాదన సరైంది కాదని దీని ద్వారా స్పష్టమైపోతుందని పలువురు మండిపడుతున్నారు. ఈ శాటిలైట్ ఛాయాచిత్రంలో ఓ బ్రిడ్జి కూడా కనిపిస్తుంది. బెలారూస్- ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఈ కొత్త బ్రిడ్జి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు యుద్ధానికి అవసరమైన పరికరాలు, విమానాలను కూడా రష్యా మోహరించినట్లు ఇందులో కనిపిస్తోంది. వీటన్నింటితో పాటు ఓ ఆసుపత్రి కూడా అక్కడే ఉన్నట్లు అందులో కనిపిస్తోంది.
ఆధారాలు చూపండి… నాటో అధ్యక్షుడు
ష్యా తీరుపై నాటో అధ్యక్షుడు తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికీ రష్యా దళాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో అలాగే ఉన్నాయని, పైగా సంఖ్య కూడా పెరిగిందని నాటో అధ్యక్షుడు జేమ్స్ స్టోల్టెన్‌బర్గ్ ప్రకటించారు. బలగాలు వెనక్కి తగ్గాయనడానికి కావాల్సిన ఆధారాలు తమకు చూపాలని ఆయన సవాల్ విసిరారు. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి కొన్ని బలగాలను ఉపసంహరించామని రష్యా ప్రకటించింది. కొన్ని దళాలను బేస్ క్యాంప్‌కు పంపినట్లు రష్యా పేర్కొంది. అయితే నాటో అధ్యక్షుడు మాత్రం బలగాలు అక్కడే ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇక ఇదే అంశపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కూడా స్పందించారు.
రష్యా మాటలను తాము ఎంత మాత్రం నమ్మలేకపోతున్నామని తేల్చి చెప్పారు. ఇప్పటికీ ఉక్రెయిన్ను ఆక్రమించే స్థితిలోనే రష్యా బలగాలు కాపుకాశాయని, ఇప్పటికీ దాడి చేసే అవకాశాలు సజీవంగానే ఉన్నాయన్నారు. అయినా… దౌత్యం ద్వారా దాడులను ఆపడానికి తాము సిద్ధంగానే ఉన్నామని జోబైడెన్ ప్రకటించారు. తాము ఇప్పటికీ నాటో దేశాలకు బలంగా మద్దతిస్తామని, ఒక నాటో దేశంపై దాడికి దిగితే.. అన్ని దేశాలపై దాడి చేసినట్లే తాము భావిస్తామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పష్టం చేశారు.