మాస్కో: అణ్వాయుధ సామర్థ్యం కలిగిన పోసిడాన్ మానవరహిత అండర్‌వాటర్ వెహికిల్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) పేర్కొన్నారు. ఆ వెహికల్‌ను జలాంతర్గామి నుంచి బూస్టర్ ఇంజిన్ సాయంతో విజయవంతంగా పరీక్షించినట్లు చెప్పారు. పోసిడాన్‌ను అణ్వాయుధ సామర్థ్యం కలిగిన టార్పిడోగా చెబుతున్నారు. అయితే సముద్ర గర్భంలో ఆ టార్పిడో ఆటోమెటిక్‌గా న్యూక్లియర్ ప్రొపల్సన్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేస్తుందని పుతిన్ తెలిపారు. మాస్కోలో మిలిటరీ ఆస్పత్రి సందర్శించిన ఆయన అక్కడ ఈ విషయాన్ని చెప్పారు.
పోసిడాన్ ఓ కొత్త తరహా సాంకేతికతకు నిదర్శనమని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్ర పెస్కోవ్ తెలిపారు. ప్రపంచ శాంతి కోసం ఇలాంటి ఆయుధాలు అవసరమని ఆయన అన్నారు. అన్ని అంతర్జాతీయ నిబంధనలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారమే పరీక్ష చేపట్టినట్లు తెలిపారు. న్యూక్లియర్ పవర్ పోసిడాన్ టార్పిడోతో .. కోస్టల్ ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో రేడియోధార్మికత సృష్టించవచ్చు అని చెబుతున్నారు. పోసిడాన్ అంటే.. గ్రీకులకు చెందిన సముద్ర దేవుడు. ఆ పేరును తన టార్పిడోకు రష్యా వాడుకున్నది. మంగళవారం అణ్వాయుధ టార్పిడో పరీక్ష జరిగినట్లు పుతిన్ పేర్కొన్నారు. ఇలాంటి ఆయుధం మరొకటి లేదని ఆయన అన్నారు. పోసిడాన్‌ను అడ్డగించే విధానం ఏదీ లేదన్నారు.
పోసిడాన్ న్యూక్లియర్ పవర్ టార్పిడో సుమారు 10 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని తెలుస్తోంది. ఆ టార్పిడో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అయితే ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో వెనక్కి తగ్గేది లేదన్న ఉద్దేశాన్ని పుతిన్ వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయుధాల సమీకరణలో అమెరికా, చైనాతో పాటు రష్యా పోటీపడుతున్నది. ఈ నేపథ్యంలో పోసిడాన్ అణ్వాయుధ టార్పిడోను కలిగి ఉండడం గొప్ప విషయమని పుతిన్ అన్నారు.
పోసిడాన్ టార్పిడో సుమారు 20 మీటర్ల పొడుగు ఉంటుంది. దాని చట్టు వైశాల్యం 1.8 మీటర్లు ఉంది. సుమారు 100 టన్నుల బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఆయుధ నిపుణలు మాత్రం ఆ వెపన్ పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సుమారు రెండు మెగాటన్నుల వార్‌హెడ్‌ను తీసుకెళ్లగలదని చెబుతున్నారు. తమ వద్ద ఉన్న ఖండాంతర క్షిపణి సర్మత్ కన్నా బెటర్‌గా పోసిడాన్ తన సామర్థ్యాన్ని చాటినట్లు పుతిన్ వెల్లడించారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బురెవిస్నిక్ క్షిపణిని కూడా ఇటీవల రష్యా పరీక్షించిన విషయం తెలిసిందే.