మాస్కో, అక్టోబర్ 16: ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ.. రష్యా, నాటో సభ్య దేశాల మధ్య కూడా ఉద్రిక్తతలు అదేస్థాయిలో పెరుగుతున్నాయి. ఉక్రెయిన్‌కు నాటో ఇతర సభ్య దేశాలు ఆయుధ సంపత్తి, ఆర్థిక పరంగా సాయం చేస్తుండటంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గుర్రుగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో నాటో దేశాలకు పలుమార్లు హెచ్చరికలు చేసిన పుతిన్.. తాజాగా నాటో సభ్యదేశమైన నార్వేతో పాటు ఫిన్లాండ్ (త్వరలో నాటోలో చేరనున్నది)కు సరిహద్దుల్లో ఉండే తమ ఒలెన్యా ఎయిర్‌బేస్‌లో 11 న్యూక్లియర్ బాంబర్ విమానాలను మోహరించారు. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు తాజాగా బయటకు వచ్చాయి. తనకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు అండగా వ్యవహరిస్తున్న ఐరోపాపై పుతిన్ అణుదాడికి ప్రణాళికలు వేస్తున్నారా? అనే దానిపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకున్నది.
వయాగ్రా వినియోగించి రేప్‌లు!
ఉక్రెయిన్ మహిళలపై రష్యా సైనికులు పాల్పడినట్టుగా చెబుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులు రష్యా సైనిక వూహ్యంలో భాగమని ఐక్యరాజ్యసమితి రాయబారి ప్రమీలా పాటేన్ పేర్కొన్నారు. రష్యా బలగాలు వయగ్రా వేసుకొని మరీ రేప్‌లు చేశారని, ఈ విషయాన్ని బాధిత మహిళలు పేర్కొన్నారని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే ఇది సైనిక వూహ్యమేనన్న విషయం స్పష్టమౌతున్నదని అభిప్రాయపడ్డారు.