మాస్కో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Biden).. ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న సమయంలో.. ఖండాంతర క్షిపణిని(ICBM) రష్యా పరీక్షించినట్లు తెలుస్తోంది. అయితే ఆ పరీక్ష విఫలమైనట్లు ఇద్దరు అమెరికా అధికారులు వెల్లడించారు. నిజానికి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్( ఐసీబీఎం) పరీక్ష గురించి రష్యా ముందుగానే అమెరికాకు నోటిఫై చేసిందన్నారు. కానీ ఆ పరీక్షతో అమెరికాకు ఎటువంటి సమస్య తలెత్తలేదని కూడా ఓ అధికారి చెప్పారు.
భారీ బరువు ఉన్న సర్మట్ మిస్సైల్(Sarmat missile)ను రష్యా పరీక్షించినట్లు భావిస్తున్నారు. ఈ మిస్సైల్‌ను సైతాన్-2గా కూడా పిలుస్తున్నారు. అణ్వాయుధాలను ఇది మోసుకెళ్లగలదు. అయితే ఆ ఖండాంతర క్షిపణి పరీక్ష విఫలమైనట్లు ఓ అధికారి చెప్పారు. నిజానికి గతంలో ఈ క్షిపణి పరీక్ష సక్సెస్ అయ్యింది. కానీ సోమవారం నిర్వహించిన ఐసీబీఎం పరీక్ష విఫలమైనట్లు చెబుతున్నారు. ఒకవేళ ఆ పరీక్ష సక్సెస్ అయి ఉంటే.. ఆ విషయాన్ని పుతిన్ తన ప్రసంగంలో ప్రస్తావించేవారన్నారు.
ఉక్రెయిన్‌లో బైడన్ ఉన్నప్పుడే ఈ పరీక్ష జరిగినట్లు కొందరు చెబుతున్నా.. ఆయన అక్కడకు చేరుకోకముందే ఈ పరీక్ష జరిగినట్లు మరికొందరు వెల్లడించారు. అయితే ఐసీబీఎం పరీక్ష ఎప్పుడు జరిగినా..రెండు దేశాలు మాత్రం తమకు అనువైన రూట్లో సంప్రదింపులు జరుపుకున్నట్లు తెలుస్తోందని ఓ అధికారి చెప్పారు.
సర్మట్ మిస్సైల్‌ను 2016లో లాంచ్ చేశారు. అది సుమారు 11 వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు. దాదాపు వంద టన్నుల బరువును ఇది మోసుకెళ్తుంది. ఆర్-36ఎం వోవోడాకు అప్డేట్గా సర్మట్ మిస్సైల్‌ను డిజైన్ చేశారు. రష్యాను బెదిరించే వాళ్లకు ఈ మిస్సైల్ గుణపాఠం చెబుతుందని గతంలో పుతిన్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.