కీవ్, ఏప్రిల్ 17: రష్యా అణుదాడికి పాల్పడే అవకాశం ఉన్నదని, అందుకు సిద్ధంగా ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలను హెచ్చరించారు. రేడియేషన్ అనారోగ్యాన్ని నివారించేందుకు యాంటీ రేడియేషన్ ఔషధాలను నిల్వ ఉంచుకోవాలని సూచించారు. అణు ఆయుధాలు వినియోగించాలని రష్కా నిర్ణయం తీసుకునేవరకు మనం వేచిచూడలేమని, ముందుగానే సిద్ధంగా ఉండాలని శనివారం ఓ ఇంటర్వ్యూలో అన్నా రు. శుక్రవారం కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. న్యూక్లియర్ ఆయుధాల వినియోగాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ పరిగణనలోకి తీసుకునే అవకాశాన్ని తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన కొద్ది రోజులకే తమ అణు బలగాలను అలర్ట్ చేసినట్టు రష్యా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
తమ అస్థిత్వానికి ముప్పు ఏర్పడిన నేపథ్యంలో అణ్వాయుధాలు వినియోగిస్తామని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. యుద్ధంలో తిరిగి పైచేయి సాధించేందుకు చిన్న అణ్వాయుధాలతో దాడి చేసే సూత్రం కూడా రష్యా మిలటరీ డాక్ట్రిన్‌లో ఉన్నది. రష్యాకు చెందిన యుద్ధనౌక ‘మాస్కువా’ గురువారం నల్లసముద్రంలో మునిగిపోయిన తర్వాత పుతిన్ ఉక్రెయిన్‌పై దాడులను మళ్లీ ఉద్ధృతం చేసిన విషయం తెలిసిందే. కీవ్, ఖార్కీవ్తో పాటు పలు నగరాలపై రష్యా బలగాలు క్షిపణి దాడులు చేశాయి. ఖార్కీవ్ నగరంపై రష్యా షెల్లింగ్ దాడుల్లో ఐదుగురు మరణించారని ఉక్రెయిన్ వైద్యాధికారులు పేర్కొన్నారు.
లొంగిపోండి.. లేకుంటే నాశనం చేస్తాం
మరియుపోల్‌లో ఉక్రెయిన్ సైనికులు ఆయుధాలు వదిలి లొంగిపోవాలని, లేకుంటే నాశనం చేస్తామని రష్యా అల్టిమేటం ఇచ్చింది. ఇందుకు అజోవ్‌స్టాల్ స్టీల్ మిల్ వద్ద ఉన్న ఉక్రేనియన్లకు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు డెడ్‌లైన్ పెట్టింది. అయితే ఉక్రెయిన్ సైనికులు రష్యా బెదిరింపులకు లొంగలేదు. రష్యా యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉక్రెయిన్ చేస్తున్న పోరాటం వీరోచితమని ఇటలీ ప్రధాని మారి యో డ్రాఘి కొనియాడారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా స్పెయిన్‌లోని ఓ గ్రామం పేరును ఉక్రెయిన్‌గా మార్చా రు. ఈ గ్రామంలోని వీధుల పేర్లను కూడా కీవ్, ఒడెసా, మరియుపోల్ అని మార్చారు.