Russia commander | ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా అనేక నష్టాలను చవిచూస్తూనే ఉన్నది. రష్యా కోల్పోయిన నగరాలను ఉక్రెయిన్ వేగంగా తిరిగి పొందుతున్నది కూడా. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై పట్టుసాధించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్న పుతిన్.. ఇప్పుడు తన కమాండర్‌ను మార్చేశారు. మూడు నెలల క్రితం నియమించిన సెర్గీ సురోవికిన్‌ను తొలగించారు. ఆయన స్థానంలో ఆర్మీలోని సీనియర్ మోస్ట్ అధికారిని ఆ పదవిలో నియమించారు. రష్యా కొత్త కమాండర్ జనరల్ వాలెరీ గెరాసిమోవ్ వ్యవహరించనుననారు.
వాలెరీ గెరాసిమోవ్ 2012 నుంచి రష్యా జనరల్ స్టాఫ్‌గా కొనసాగుతున్నారు. ఈయనను కొత్త కమాండర్‌గా పుతిన్ ఎంచుకున్నారు. దాంతో సెర్గీ సురోవికిన్ స్థానంలో ఈయన ఉక్రెయిన్ యుద్ధానికి పూర్తి బాధ్యత వహిస్తాడు. వాలెరీ గెరాసిమోవ్ రాకతో యుద్ధం మరింత తీవ్రతరం, ప్రమాదకరమయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఆర్మీ ఫోర్సెస్ వివిధ శాఖల్లో మెరుగైన సమన్వయం కోసం ఈ పునర్వ్యవస్థీకరణ జరపడం సాధారణమే అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ఉక్రెయిన్‌పై యుద్ధంలో విజయం సాధించడంలో సురోవికెన్ వెనకబడిపోవడంతోనే తొలగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ వార్తలను సైనిక విశ్లేషకుడు రాబ్ లీ తోసిపుచ్చారు. సురోవికెన్ తొలగింపు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. సురోవికిన్ యుద్ధ కమాండర్ అయినప్పటి నుంచి చాలా శక్తివంతంగా మారారని, రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, రష్యా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ ద్వారా కాకుండా నేరుగా పుతిన్‌ను కలుసుకుంటున్నందునే ఇలా మార్పు చేయాల్సి వచ్చిందని రాబ్ లీ స్పష్టం చేస్తున్నారు. ఈ సమయంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ యుద్ధానికి నాయకత్వం వహించడం అవసరమని, ఇక యుద్ధం మరో స్థాయికి వెళ్లడం ఖాయమని మాస్కోకు చెందిన ఒక నిపుణుడు అల్‌జజీరా వార్తా సంస్థలో చెప్పారు.