Russia : మిత్రదేశం భారత్ (India) కు చమురు సరఫరాలో ఎలాంటి ఆటంకం రానివ్వమని రష్యా (Russia) హామీ ఇచ్చింది. భారత్ విషయంలో చమురు సరఫరాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ నెరవేరుస్తామని రష్యా విదేశాంగ మంత్రి (Russia Foreign Minister) సెర్గీ లావ్రోవ్ ( Sergey Lavrov) చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు స్నేహంపై ఆధారపడి ఉన్నాయని, వాటి దారులు వేరయ్యే పరిస్థితి ఏమాత్రం ఉండదని అన్నారు.
త్వరలో భారత పర్యటనకు రానున్న లావ్రోవ్.. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రపంచం చూసిన శక్తిమంతమైన నాయకుల్లో ప్రధాని మోదీ ఒకరని కొనియాడారు. ఆర్థిక వ్యవస్థ, సైన్యం, సంస్కృతి.. ఇలా అన్ని రంగాల్లో భారత్ సార్వభౌమాధికారాన్ని సాధించడమే లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారని అన్నారు. ఇంధన సరఫరాల బాధ్యతలను నెరవేర్చడంలో రష్యా ఎన్నడూ విఫలం కాలేదని చెప్పారు.
చమురు సరఫరా విషయంలో భారత ప్రయోజనాలకు ఎలాంటి నష్టం జరగనివ్వమని.. అన్యాయమైన, నిజాయతీలేని పోటీ మార్కెట్ రెండు దేశాల మధ్య ఒప్పందాలను దెబ్బతీయకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని లావ్రోవ్ చెప్పారు. కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం కోసం కొత్త పవర్ యూనిట్ల నిర్మాణంలో తమ సహకారం కొనసాగుతుందన్నారు. భారత అవసరాల దృష్ట్యా గ్యాస్, చమురు, బొగ్గు వంటివి సరఫరా చేస్తూనే ఉంటామని తెలిపారు.
భారత్- రష్యా సంబంధాలను బలహీనపరిచేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలపట్ల అప్రమత్తత అవసరమని లావ్రోవ్ హెచ్చరించారు. ‘హిందీ- రూసీ భాయ్ భాయ్ (భారతీయులు- రష్యన్లు సోదరులు)’ అనేది సరదా నినాదం మాత్రమే కాదని, అది మన సంస్కృతిలో భాగమని చెప్పారు. భారతీయ సినిమాలు, రాజ్ కపూర్, టెలివిజన్ సిరీస్‌లు ఇవన్నీ రష్యాలో ప్రతిచోటా ప్రజాదరణ పొందాయని తెలిపారు.
ఆర్థిక వ్యవస్థ, సైనిక సహకారం, ఇంధన సరఫరాలు, సాంస్కృతిక-మానవతా సంబంధాల వంటి అనేక అంశాల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు దృఢంగా ఉన్నాయని లావ్రోవ్ అన్నారు. భారత పర్యటన సందర్భంగా విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తో లావ్రోవ్ చర్చలు జరపనున్నారు. ‘బ్రిక్స్’ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరుకానున్నారు.