Russia New Year Gift | కొత్త సంవత్సరం ప్రారంభంలో తన సైనికులకు న్యూ ఇయర్ గిఫ్ట్‌ను రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో విజయం సాధించడం కోసం తన సైనికులకు రష్యా ప్రభుత్వం పలు తాయిలాలు ఇవ్వనున్నట్లు చెప్పింది. కాగా, ఉక్రెయిన్ యుద్దంలో పాల్గొనేందుకు రష్యా తన సైనికులను మరింత సన్నద్ధం చేయడంలో భాగంగా ఇలాంటి గిఫ్ట్ ప్రకటించిందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనేందుకు తన సైనికులను ప్రలోభపెట్టేందుకు రష్యా అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొంటున్న సైనికులు, ఇతర ఉద్యోగులు ఇక నుంచి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని రష్యా ప్రకటించింది. దీంతో పాటు యుద్ధంలో మానవత్వంతో ప్రవర్తించే సైనికులకు ప్రభుత్వం బహుమతులు కూడా ఇవ్వనున్నది. ఈ మేరకు రష్యా ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. ఉక్రెయిన్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖార్సన్. జపోరిజియాలోని నాలుగు ప్రాంతాల్లో యుద్ధంలో పోరాడుతున్న సైనికులను అవినీతి నిరోధక చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రకటన నేపథ్యంలో రష్యా సైనికులు ఇక నుంచి తమ ఆదాయం, ఖర్చులు, ఆస్తుల గురించి ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదన్నమాట.
సైనికులతో పాటు యుద్ధంలో సేవలందిస్తున్న పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు. మాస్కో టైమ్స్ ప్రకారం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముసాయిదాపై సంతకం చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనే వారి శుక్ర కణాలను ప్రభుత్వం ఉచితంగా ఫ్రీజ్ చేయనున్నట్లు గతంలో ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. తద్వారా యుద్ధంలో వారికి ఏదైనా జరిగితే వారి వంశం కొనసాగేందుకు కూడా వీలుంటుంది.