న్యూయార్క్: రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడేళ్ల నుంచి యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ రెండు దేశాలు కాల్పుల విమరణ అంశంపై తక్షణమే చర్చలు చేపట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రెండు గంటల పాటు ఫోన్లో చర్చలు జరిపిన తర్వాత ట్రంప్ ఈ విషయాన్ని చెప్పారు. పుతిన్‌తో ఫోన్ చర్చలు సజావుగా సాగినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే శాంతి కోసం రెండు దేశాల మధ్య చర్చలు అవసరమన్నారు.
ట్రంప్ ఆశాజనక స్టేట్మెంట్ ఇచ్చినా.. కాల్పుల విరమణ లేదా శాంతి ఒప్పందం కుదిరేలా ఉన్నట్లు కనిపించడంలేదన్న అభిప్రాయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉన్నారు. శాంతి ఒప్పందంపై కుదిరే అంశం గురించి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ పేర్కొన్నారు. జెలెన్స్కీ కూడా దీనిపై స్పందిస్తూ.. ఆ చర్చలకు అమెరికా దూరం కావొద్దు అని కోరుకున్నారు.
శాంతి ఒప్పందంపై మెమోరండం కుదుర్చుకునేందుకు కీవ్‌తో కలిసి పనిచేయనున్నట్లు రష్యా అధ్యక్షుడు పేర్కొన్నారు. ట్రంప్‌తో ఫోన్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇద్దరి మధ్య చర్చలు ఫలప్రదమైనట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో ఏర్పడిన యుద్ధానికి గల కారణాలను విశ్లేషిస్తూ వాటికి పరిష్కారాన్ని ఆశిస్తూ మెమోరాండంను తయారు చేయనున్నట్లు పుతిన్ తెలిపారు. కాల్పుల విమరణ అంశాన్ని కూడా ప్రస్తావించనున్నట్లు చెప్పారు.