Russia – Ukraine War | రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలై మూడేళ్లు కావొస్తున్నది. ఇప్పటికీ ఇరుదేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఇరుదేశాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. మాస్కో చేస్తున్న యుద్ధ ప్రయత్నాలకు సహాయం అందించేందుకు ఉత్తర కొరియా అంగీకరించినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో వేలాది మంది సైనికులను మోహరించిన నేపథ్యంలో చర్చల కోసం ఉత్తర కొరియా అగ్ర దౌత్యవేత్త చర్చల కోసం మాస్కో చేరుకున్నారు. ఈ క్రమంలోనే రష్యా, ఉక్రెయిన్ పర్పరం దాడులు చేసుకున్నాయి. రష్యా బుధవారం రాత్రి 62 డ్రోన్లతో దాడి చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది.
ఇందులో 33 డ్రోన్లను అడ్డుకున్నామని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ పేర్కొంది. కివీవ్లోని నివాస భవనాలతో పాటు కిండర్ గార్డెన్‌ను డ్రోన్లు ఢీకొట్టాయని.. ఇక చిన్నారితో సహా తొమ్మిది గాయపడ్డట్లుగా స్థానిక పరిపాలన తెలిపింది. పశ్చిమ నైరుతిలోని పలు ప్రాంతాలపై 25 ఉక్రేనియన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు సహాయం చేయడానికి ఉత్తర కొరియా సైనికులను పంపుతున్నట్లు సమాచారం అందుకున్న దక్షిణ కొరియా, వాటిని పర్యవేక్షించడానికి సైనిక బృందాన్ని పంపాలని నిర్ణయించింది. ఉత్తర కొరియా 11 వేల మంది సైనికులను రష్యాకు పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, ఉత్తర కొరియా తన విదేశాంగ మంత్రి చోయ్ సన్ హుయ్‌ని రష్యాకు పంపింది. అయితే, ఆయన పర్యటన వెనుక ఉద్దేశం మాత్రం తెలియరాలేదు.