షార్జా, అక్టోబర్ 21: 10 కేజీల బరువు.. రూ.9.5 కోట్ల విలువ. చూడగానే కళ్లు జిగేల్ మనిపించేలా స్వర్ణంతో తయారైన డ్రెస్ అందరినీ ఆకట్టుకుంటున్నది. ప్రపంచంలోనే అత్యంత విలువైన బంగారు గౌనును తయారు చేసిన ఘనతను దుబాయ్‌లో ఉన్న అల్ రోమైజాన్ గోల్డ్ అండ్ జ్యువెలరీ దక్కించుకుంది. సౌదీ అరేబియా కేంద్రంగా ఉన్న ఈ సంస్థ గిన్నిస్ ప్రపంచ రికార్డును కూడా సాధించింది. ‘దుబాయ్ డ్రెస్’ పేరిట ఇటీవల షార్జాలో జరిగిన 56వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఈ బంగారు డ్రెస్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఈ డ్రెస్ విలాసవంతమైన డిజైన్, అద్భుతమైన చేతపని నైపుణ్యం విశేషంగా అందరినీ ఆకట్టుకుంది. బంగారంతో మెరిసిపోతున్న గౌన్‌ను ధరించిన మోడల్‌ను చూపించే వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇక ఈ స్వర్ణ గౌన్ వివరాల్లోకి వెళితే.. ఈ ఆభరణాల సమహారంలో 1,270.5 గ్రాముల బరువున్న 21 కేరట్ బంగారంతో తలపాగా, కిరీటం, చెవి రింగులు ఉన్నాయి. మొత్తం బరువు 10,081.2 గ్రాములు. దీని విలువ భారత కరెన్సీలో సుమారు రూ.9.56 కోట్లు. దీనిని తయారు చేసేందుకు 980 గంటలు పట్టిందని నిర్వాహకులు తెలిపారు.