Rishi Sunak | త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత అమెరికా తరలి వెళ్లిపోతారంటూ తనపై జరుగుతున్న ప్రచారంపై బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak) స్పందించారు. ఈ మేరకు ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. తాను ఎక్కడికి వెళ్లిపోవడం లేదని.. బ్రిటన్ తన సొంత ఇల్లు అని స్పష్టం చేశారు.
రిషి సునాక్ కొన్ని వారాల్లో తన కుటుంబంతో కలిసి అమెరికాలోని కాలిఫోర్నియా (California)కు వెళ్లిపోవాలని ప్రణాళికలు రచిస్తున్నారంటూ సొంత పార్టీ అయిన కన్జర్వేటివ్ పార్టీకి చెందిన నేత, మాజీ మంత్రి జాక్ గోల్డ్‌స్మిత్ (Zac Goldsmith) ఇటీవలే ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దీంతో ఇదికాస్తా ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై తాజాగా సునాక్ స్పందించారు. అమెర్శామ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో.. ఆ ఆరోపణలను కొట్టిపారేశారు.
‘జాక్ గోల్డ్‌స్మిత్ మాటలు వింటుంటే ఆశ్చర్యమేస్తోంది. ఆయనతో మాట్లాడక చాలా రోజులైంది. కానీ, మా కుటుంబ విషయాల గురించి అవగాహన ఉన్నట్లు ఆయన చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. అయినా నేను బ్రిటన్ వదిలి ఎక్కడికీ వెళ్లడం లేదు. ఈ దేశమే నా ఇల్లు. సౌంతాప్టన్లో పుట్టి పెరిగాను. ఇక్కడే ఉంటా. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే విలువలకు నేను కట్టుబడి ఉన్నాను. నా కుటుంబాన్ని ఇక్కడి నుంచి వేరే చోటుకు తరలించే ఉద్దేశం లేదు. ఇక్కడే ఉంటూ.. ప్రజలకు సేవచేస్తూ.. సెయింట్ మేరీస్ స్టేడియంలో సౌతాంప్టన్ ఫుట్‌బాల్ క్లబ్ మ్యాచ్‌లు చూస్తూ సంతోషంగా గడపాలనుకుంటున్నా’ అని సునాక్ తెలిపారు.
జులై 4న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇక గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అయితే, ప్రధానిగా సునాక్ తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో (UK general election) అధికార కన్జర్వేటివ్ పార్టీ (Conservative party)కి ఓటమి ఖాయమంటూ అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.
Also Read..
CM Revanth Reddy | అధికార చిహ్నం మార్పు.. నేడు రాజకీయ పార్టీలతో సీఎం రేవంత్ సమావేశం
Delhi | ఢిల్లీలో నేడూ అధిక ఉష్ణోగ్రతలే.. రేపు మోస్తరు వాన: ఐఎండీ
Firecrackers | పూరీ జగన్నాథుడి చందన ఉత్సవంలో అపశ్రుతి.. పటాకులు పేలి 15 మందికి గాయాలు