Bangladesh | ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని కోరుతూ సచివాలయం వద్ద ఆందోళన చేస్తున్న అన్సార్ అనే పారామిలిటరీ బలగాలు, విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న అన్సార్ బలగాలు సచివాలయాన్ని ముట్టడించాయి. విద్యార్థి నాయకుడు, తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు నహీద్ ఇస్లాంను సైతం బంధించినట్టు విద్యార్థులకు సమాచారం అందింది. దీంతో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు కర్రలు పట్టుకొని వెళ్లారు.
ఇరువర్గాల మధ్య దాడులు జరిగాయి. దాదాపు 50మంది గాయపడ్డారు. అన్సార్ రూపంలో నియంతృత్వ శక్తులు మళ్లీ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత కూడా వారు ఆందోళనలు చేపట్టడం వెనుక కుట్ర ఉందని విద్యార్థి నేత హస్నత్ అబ్దుల్లా ఆరోపించారు. అయితే, ఘర్షణకు దిగింది తమ బలగాలు కాదని, బయట నుంచి వచ్చిన వారే ఇందుకు కారణమని అన్సార్ డైరెక్టర్ తెలిపారు.